10% తగ్గిన హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం

3 May, 2018 00:02 IST|Sakshi
సీఈఓ సి.విజయ్‌ కుమార్‌

ఆదాయం 2 శాతం వృద్ధి

ఒక్కో షేర్‌కు రూ.2 డివిడెండ్‌

జూలై క్వార్టర్‌ నుంచి వేతనాల పెంపు  

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.2,474 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.2,230 కోట్లకు తగ్గిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. 2016–17 క్యూ4లో పన్ను రివర్సల్‌ ప్రయోజనం లభించిందని.. అందుకే ఆ క్వార్టర్‌లో రూ.2,474 కోట్ల మేర నికర లాభం వచ్చిందని సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్‌ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 8 శాతం వృద్ధి చెందిందన్నారు. మొత్తం ఆదాయం రూ.13,183 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.13,480 కోట్లకు పెరిగింది. డాలర్ల పరంగా చూస్తే ఆదాయం 2.5 శాతం వృద్ధితో 204 కోట్ల డాలర్లకు ఎగసింది. ఇబిటా 9 శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.3,305 కోట్లకు పెరగ్గా, నిర్వహణ లాభ మార్జిన్‌ 18.4 శాతం నుంచి 19.6 శాతానికి వృద్ధి చెందింది. ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అంచనాలు అందుకున్నాం...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 1 శాతం వృద్ధితో రూ.8,722 కోట్లకు, మొత్తం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.51,786 కోట్లకు పెరిగాయి. నిలకడ కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 11 శాతం వృద్ధితో 780 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్‌ 19.7 శాతం చొప్పున వృద్ధి చెందిందని, అంచనాలను అందుకున్నామని విజయ్‌కుమార్‌ చెప్పారు. తదుపరి తరం డిజిటల్‌ సర్వీసుల విభాగంపై 10 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశామని, డిజిటల్‌ సర్వీసులు, ఐపీ విభాగాలు కలిసి 42 శాతం వృద్ధి చెందాయని, మొత్తం ఆదాయంలో వీటి వాటా 23 శాతమని పేర్కొన్నారు. 

డిజిటల్‌ జోరు...
గత ఆర్థిక సంవత్సంలోనూ, క్యూ4లోనూ మంచి పనితీరు కనబరిచామని విజయ్‌ కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని, కొత్త క్లయింట్ల సంఖ్య జోరుగా పెరిగిందని, ఆదాయాలు బాగా పెరిగాయని తెలియజేశారు. డిజిటల్‌ సర్వీసుల జోరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి డీల్స్‌ సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు 9.5–11.5 శాతం రేంజ్‌లో ఉండగలవని అంచనా వేశారు. నిర్వహణ మార్జిన్‌లు 19.5–20.5 శాతం రేంజ్‌లో ఉండొచ్చన్నారు. కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా జర్మనీ, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లోని కంపెనీలను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, నాగ్‌పూర్, లక్నో, మదురైల కార్యాలయాల విస్తరణకు, విదేశాల్లో విస్తరణకు కూడా ఈ నిధులు వినియోగిస్తామని కంపెనీ సీఎఫ్‌ఓ అనిల్‌ చనన చెప్పారు. 

వేతనాల పెంపు
ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.2 లక్షలుగా ఉందని, ఆట్రిషన్‌ రేటు (ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం) 15.5 శాతంగా ఉందని విజయ్‌ కుమార్‌ తెలిపారు.  జూలై క్వార్టర్‌ నుంచి ఉద్యోగుల వేతనాలు పెంచనున్నామని, ఎంత మేర పెంచాలనే విషయమై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని వివరించారు. 

5 శాతం తగ్గిన షేర్‌ ధర..
నికర లాభం 10 శాతం తగ్గడంతో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 5 శాతం నష్టపోయింది. బీఎస్‌ఈలో 4.7 శాతం నష్టంతో రూ.1,001 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,009 కోట్లు తగ్గి రూ.1,39,371 కోట్లకు పడిపోయింది.   

మరిన్ని వార్తలు