పౌల్ట్రీకి రోజుకు 100 కోట్ల నష్టం..

22 Nov, 2016 00:59 IST|Sakshi
పౌల్ట్రీకి రోజుకు 100 కోట్ల నష్టం..

పెద్ద నోట్ల రద్దుతోనే సమస్య
10 లక్షల మందికి జీతాలే లేవు
మీడియాతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు
నేటి నుంచే హైటెక్స్‌లో పౌల్ట్రీ సదస్సు 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాలుగేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటున్న పౌల్ట్రీ రంగానికి 2016 కూడా కలిసి రాలేదు. ఈ ఏడాదైనా నష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్న  పరిశ్రమకు పెద్ద నోట్ల రద్దు రూపంలో అవాంతరం వచ్చి పడిందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రంజిత్ రెడ్డి చెప్పారు. చిల్లర సమస్యతో కొనుగోలుదార్లు లేక గుడ్లు, చికెన్ అమ్మకాలు ప్రస్తుతం 50-60 శాతానికే పరిమితమయ్యాయని సోమవారమిక్కడ మీడియాకు తెలియజేశారు.

‘‘నోట్ల రద్దు తర్వాత మొదటి రెండు రోజులు అమ్మకాలు 30 శాతమే నమోదయ్యారుు. పౌల్ట్రీకి అత్యంత కీలకమైన నవంబరు-డిసెంబరులో అమ్మకాలు పడిపోవడం కోలుకోలేని దెబ్బ’’ అని చెప్పారాయన. ప్రస్తుతం రోజుకు దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతోందని చక్ర గ్రూప్ ఎండీ పి.చక్రధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ఈ నష్టం రోజుకు రూ.20 కోట్లపైనే ఉందన్నారు. దేశంలో రోజుకు 21 కోట్ల గుడ్లు, 2 కోట్ల కిలోల చికెన్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమలో ఏటా రూ.1 లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోంది.

జీతాలు చెల్లించలేం..: దేశవ్యాప్తంగా పౌల్ట్రీ విపణిలో లక్ష మంది రైతులున్నారు. 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఆధారపడ్డారు. ఒక్క తెలంగాణలోనే 25 వేల మంది రైతులున్నారు. పౌల్ట్రీ ఉత్పాదనలో అగ్రగామిగా ఉన్న ఈ రాష్ట్రంలో రోజూ 4 కోట్ల గుడ్లు, 15 లక్షల కిలోల చికెన్ ఉత్పత్తి అవుతున్నారుు. ఏటా రూ.10,000 కోట్ల వ్యాపారం నమోదవుతోంది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు, చిల్లర దొరక్కపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు చెప్పారు. కోళ్లకు దాణా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. పౌల్ట్రీ రైతులు, ఈ రంగంలోని కంపెనీల రుణాలను ఏడాది పాటు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంతర్జాతీయ పౌల్ట్రీ సదస్సు..
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ (22-25) పౌల్ట్రీ సదస్సు జరుగనుంది. 200 భారతీయ, 50 విదేశీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారుు. 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. అంతర్జాతీయ స్థారుులో దీనిని నిర్వహిస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ గర్వారే తెలిపారు. పౌల్ట్రీ రంగంలో వచ్చిన అధునాతన టెక్నాలజీని తెలుసుకునేందుకు ప్రదర్శన ఉపకరిస్తుందని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ సభ్యులు కె.మోహన్ రెడ్డి చెప్పారు. భారత్‌తో పాటు దక్షిణాసియాకు చెందిన 800 మంది నిపుణులు నేడు (మంగళవారం) జరిగే నాలెజ్డ్ డేలో పాల్గొంటున్నారు.

>
మరిన్ని వార్తలు