ఈసారి ‘దావోస్‌’కు భారీ సన్నాహాలు

11 Nov, 2019 04:37 IST|Sakshi

జనవరిలో డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సదస్సు

భారత్‌ నుంచి 100 మంది పైగా సీఈవోలు,  రాజకీయ నేతలు

న్యూఢిల్లీ: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్‌ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్‌ స్టార్స్‌ పాల్గోనున్నారు. ప్రపంచ దేశాలు సమష్టిగా, నిలకడగా వృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసారి దావోస్‌ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సదస్సు కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా హాజరు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. గతేడాది జరిగిన సదస్సులో వీరిద్దరూ పాల్గొనలేదు. ఈసారి సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది దిగ్గజ నేతలు హాజరవుతారని భావిస్తున్నారు.  

భారత్‌ నుంచి పేర్లు నమోదైన వారిలో పారిశ్రామిక దిగ్గజాలు ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదాని, కుమార మంగళం బిర్లా, సజ్జన్‌ జిందాల్, నందన్‌ నీలేకని, అజయ్‌ పిరమల్‌ తదితరులు ఉన్నారు. మానసిక స్వస్థతపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలిగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే కూడా ఇందులో పాల్గోనున్నారు.  ఆర్థికంగా ఉన్నతవర్గాలు తమకు ద్రోహం చేస్తున్నారనే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని, మరోవైపు గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యాలు నెరవేరడం లేదని డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపక చైర్మన్‌ క్లాస్‌ ష్వాబ్‌ పేర్కొన్నారు.

ఆ స్విస్‌ ఖాతాల్లో నిధులు స్విట్జర్లాండ్‌ ఖజానాకు..
క్లెయిమ్‌ చేసుకోవడానికి చాన్నాళ్లుగా ఎవరూ ముందుకు రాకపోవడంతో భారతీయులకు చెందిన సుమారు పది ఖాతాల్లోని సొమ్ము.. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ ఖజానాకు దఖలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మనీని కట్టడి చేసే క్రమంలో నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాల వివరాలను 2015 నుంచి స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం వెల్లడిస్తోంది. అవసరమైన ఆధారాలను సమర్పించి ఖాతాలను పునరుద్ధరించుకోవాలని ఖాతాదారులకు సూచిస్తోంది. వీటిలో భారతీయులకు చెందిన ఖాతాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్నింటికి క్లెయిమ్‌ గడువు ఈ నెల, వచ్చే నెలతో తీరిపోనుంది. లీలా తాలూక్‌దార్, చంద్రలతా ప్రాణ్‌లాల్‌ పటేల్, మోహన్‌లాల్‌ మొదలైన వారి పేర్లతో ఈ ఖాతాలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా