గణాంకాలు, ఫలితాలు కీలకం

11 May, 2020 04:44 IST|Sakshi

ఈ వారంలో ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు 

కరోనా తీవ్రత... ప్యాకేజీపై ఆశలు  

లాక్‌డౌన్‌ పొడిగింపు ఆందోళనలు 

అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై దృష్టి 

మార్కెట్లో ఒడిదుడుకులంటున్న నిపుణులు  

ఈ వారం వెలువడే వివిధ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. కరోనా వైరస్‌ కేసుల తీవ్రత, ఈ వైరస్‌ వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు, అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం పరిణామాలు కూడా కీలకమేనని వారంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల  గమనం, వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ సంబంధిత వార్తలు... ఇవన్నీ కూడా తగిన ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులంటున్నారు. 

ఈ నెల 12న(మంగళవారం) మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. అదే రోజు ఏప్రిల్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఇక ఏప్రిల్‌ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (గురువారం) వస్తాయి. మారుతీ సుజుకీ,  కోటక్‌ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, బంధన్‌ బ్యాంక్‌ తదితర మొత్తం 50కు పైగా కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు– ఈ రెండు అంశాలు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి.

రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూకి రికార్డు తేది మే14
ప్రతిపాదిత రైట్స్‌ ఇష్యూకి  మే 14ను రికార్డు తేదీగా నిర్ణయించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది.

మరిన్ని వార్తలు