కోడింగ్‌ పిడుగు జునైరా ఖాన్‌ గుర్తుందా?

10 Jul, 2019 21:08 IST|Sakshi

సాప్ట్‌వేర్‌ డేవలపర్‌,  వర్దమాన వ్యాపారవేత్తగా  12యేళ్ల హైదరాబాదీ జునైరా ఖాన్‌

త్వరలోనే టీం మేనేజ్‌మెంట్‌ కోసం ఒక యాప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎనిమిదేళ్లకే  ప్రోగ్రామ్‌లు, కోడింగ్‌లు చేస్తూ అసాధారణ ప్రతిభాపాటవాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన జునైరా ఖాన్‌ గుర్తుందా. ఇపుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌కి చెందిన జునైరాఖాన్‌ (12) ఇపుడు  తన ఖాతాదారుల కోసం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేస్తూ వర్ధమాన వ్యాపారవేత్తగా ప్రశంసలందుకుంటోంది. 

జెడ్‌ఎం ఇన్ఫోకామ్‌ అనే  సొంత వెబ్‌సైట్‌ ద్వారా బీటెక్‌ విద్యార్థులకు శిక్షణనిస్తున్న జునైరా ఖాన్‌ తాజాగా మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టారు.  టీం మేనేజ్‌మెంట్‌ కోసం కొత్త అప్లికేషన్‌ను సృష్టించానని అతి త్వరలోనే దీన్ని లాంచ్‌ చేయబోతున్ననని ప్రకటించారు.  ఈ యాప్‌ ద్వారా  సంస్థలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం  చూపబోతున్నానని ఆమె తెలిపారు.  ఇప్పటికే అనేక కంపెనీలకు బిజినెస్‌ యాప్‌లను రూపొందించిన జునైరా ఖాన్‌ సొంతంగా ఒక సంస్థను నడుపుతూ వుండటం విశేషం.

ఇప్పటివరకు నేను నాలుగైదు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాను.  హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, పీహెచ్‌పీ, జావాస్క్రిప్ట్‌లపై పనిచేస్తాను. ఇప్పటికే అనేక మొబైల్‌ యాప్‌లు, బిజినెస్‌ యాప్‌లు తయారు చేశాను. ప్రస్తుతం, ఒక ఎన్‌జీవో కోసం పని చేస్తున్నానని ఖాన్  చెప్పారు. అలాగే చిన్న వయసులోనే తాను కోడింగ్‌ నేర్చుకుంటానని అనడం తనకు ఆశ్చర్యం కలిగించిందనీ, ఒక తల్లిగా ఆమెకు నేర్పడం తన బాధ్యతగా భావించానని జునైరాఖాన్‌ తల్లి నిషాద్‌ ఖాన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా జునైరా తల్లి నిషాత్‌ఖాన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెబ్‌ డెవలపింగ్‌, ఆండ్రాయిడ్‌ ఆప్‌ తరగతులు చెప్తుండేవారు. అయితే  అప్పటికే నాల్గవ తరగతి చదువుతున్న జునైరాఖాన్‌ తనకు కూడా కోడింగ్‌  నేర్పాలని పట్టుబట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన నిషాత్‌   కూతురి ఆసక్తిని ప్రోత్సహించారు. వెబ్‌ డెవలపింగ్‌, కోడింగ్‌ను నేర్పించారు. అంతే..ఇక  వెనుదిరిగి చూడలేదు.  దిన దిన ప్రవర్థమానం చెంది  చిన్న వయసులోనే  ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు చేత డిజిటల్‌ అంబాసిడర్‌ అవార్డును గెల్చుకుంది. తన పేరుతోనే జునైరా వెబ్‌ సొల్యూషన్స్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి తన అసాధారణ ప్రతిభతో దూసుకుపోతోంది. మరోవైపు జునైరా దగ్గర శిక్షణ పొందుతున్న మహమ్మద్‌ అర్బాజ్‌ అలం స్పందిస్తూ  ఆమెదగ్గర శిక్షణ పొందం నిజంగా తనకు ఎంతో సంతోషంగా ఉందనీ,  తన కరీర్ అభివృద్దిలో  ఇది మరింత సాయపడుతుందని  నమ్ముతున్నానన్నారు.

మరిన్ని వార్తలు