ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉంది

10 Mar, 2016 01:26 IST|Sakshi
ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉంది

14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. ఎకనామిక్స్ కాన్‌క్లేవ్-2016 పేరిట ఆర్థిక శాస్త్ర సదస్సు బుధవారం సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైవీ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుంటే అభివృద్ధి దిశగానే సాగుతుందన్నారు. జాతీయాదాయంలో ద్రవ్యలోటు 3 శాతం ఉండాలని, అప్పుడే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉపాధి రేటు, వ్యవసాయం, వనరుల నిర్వహణ  స్థిరంగా ఉంటే సంక్షోభాలు తలెత్తవని సూచించారు. తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో వడ్డీ రేట్లు పెంచినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రొఫెసర్లు, ఆర్థిక నిపుణులు, పరిశోధక విద్యార్థులు చర్చల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు