15 నుంచి బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓ

9 Mar, 2018 00:13 IST|Sakshi
బంధన్‌ బ్యాంక్‌

ధరల శ్రేణి రూ.370–375

ఇష్యూ పరిమాణం రూ.4,473 కోట్లు

ముంబై: కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ నెల 19న ముగిసే ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.370–375గా నిర్ణయించినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఐపీఓ ద్వారా బంధన్‌ బ్యాంక్‌ రూ.4,430–రూ.4,473 కోట్లు సమీకరిస్తుందని అంచనా. భారత బ్యాంకింగ్‌ రంగంలో ఇదే అతి పెద్ద ఐపీఓ కానుంది. ఈ ఐపీఓలో భాగంగా 11.92 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. దీంట్లో 9.76 కోట్లు తాజా షేర్లు కాగా, మిగిలినవి ఈ బ్యాంక్‌లో వాటాలున్న రెండు సంస్థలవి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రపంచబ్యాంక్‌ నియంత్రణలోని ఐఎఫ్‌సీ 1,40,50,780 షేర్లను, ఐఎఫ్‌సీ ఎఫ్‌ఐజీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ 75,65,804 షేర్లను విక్రయిస్తాయి. కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్‌ క్యాపిటల్, గోల్డ్‌మన్‌ శాక్స్, జేఎమ్‌ ఫైనాన్షియల్, జేపీ మోర్గాన్‌లు వ్యవహరిస్తున్నాయి. 

2015 నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు...
ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మూలధన అవసరాల కోసం వినియోగిస్తామని బంధన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కూడా అయిన చంద్ర శేఖర్‌ ఘోష్‌ వెల్లడించారు. 2014, ఏప్రిల్‌లో ఆర్‌బీఐ నుంచి బ్యాంకింగ్‌ లైసెన్స్‌ పొందామని, 2015, ఆగస్టులో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించామని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ చివరినాటికి తమ డిపాజిట్లు రూ.25,293 కోట్లుగా, అడ్వాన్స్‌లు రూ.24,463 కోట్లుగా ఉన్నాయన్నారు. కార్పొరేట్‌ రంగ రుణాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వబోమని, సూక్ష్మ రుణాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి బంధన్‌బ్యాంక్‌కు 840 బ్రాంచ్‌లు, 383 ఏటీఎమ్‌లు ఉన్నాయి. 70 శాతానికి పైగా బ్రాంచీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు