పీఎంసీ కేసులో హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

4 Oct, 2019 04:54 IST|Sakshi

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో–ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్టర్లు ఇరువురు అరెస్ట్‌ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్‌కు సంబంధించి రాకేష్‌ వాద్వాన్, ఆయన కుమారుడు సారంగ్‌ వాద్వాన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్‌డీఐఎల్‌ సీనియర్‌ అధికారులపై ఈఓడబ్ల్యూ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో సస్పెండయిన పీఎంసీ బ్యాంక్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ థామస్, చైర్మన్‌ వార్యాన్‌ సింగ్, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల పేర్లను చేర్చారు.  కేసులో దర్యాప్తునకు సిట్‌ కూడా ఏర్పాటయ్యింది.  

రూ.25,000 వరకు ఉపసంహరణకు అవకాశం
కాగా పీఎంసీ బ్యాంకుపై తన ఆంక్షలను ఆర్‌బీఐ గురువారం మరింత సడలించింది. ఒక్కో ఖాతా నుంచి ఉపసంహరణ పరిమితిని రూ.25,000కు పెంచింది. కొద్ది రోజుల కిందట కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా,  అటుతర్వాత ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. ఈ పరిమితిని తాజాగా రూ.25,000కు పెంచడంతో  70 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. వీరు 25,000 వరకూ విత్‌డ్రా చేసుకోగలుగుతారు. ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.

మరిన్ని వార్తలు