20 ఏళ్లలో దేశవ్యాప్తంగా... 200 చిన్న ఎయిర్ పోర్టులు

11 Mar, 2014 00:45 IST|Sakshi
20 ఏళ్లలో దేశవ్యాప్తంగా... 200 చిన్న ఎయిర్ పోర్టులు

 రాష్ట్రం నుంచి నాలుగైదు నగరాలు
  భారత్‌పై విదేశీ సంస్థలు ఆసక్తి
  హెలిటూరిజంలో అవకాశాలున్నాయి
   విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి అశోక్‌కుమార్

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులను అందించడంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లలో 200 నగరాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో రాష్ట్రం నుంచి నిజామాబాద్, వరంగల్‌తోసహా నాలుగైదు విమానాశ్రయాలు ఉంటాయని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జి.అశోక్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాల మాదిరిగా కాకుండా చిన్న విమానాలు నడవగలిగేలా తక్కువ వ్యయంతో వీటిని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ, రాజమండ్రి, కడప, రాయచూరు, ఇండోర్ వంటి నగరాల్లో విమానాశ్రయం ఉన్నా సర్వీసులు సరిగా ఉండడం లేదన్నారు. 200 నగరాలకుగాను ఇప్పటికే విమానాశ్రయం ఉంటే విస్తరణ చేపట్టడం, లేదా కొత్తగా ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ నగరాలకు సర్వీసులు నడిపేలా ఆపరేటర్లతో చర్చిస్తామన్నారు. 10-40 మంది ప్రయాణించగలిగే విమానాలు చిన్న నగరాలకు చక్కగా సరిపోతాయి. చిన్న విమానాలు కొనగలిగేవారు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోయేతర నగరాల నుంచి వస్తున్న ఎయిర్ ట్రాఫిక్ 30 శాతముంది. కొన్నేళ్లలో ఇది 45 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 12-16 తేదీల్లో బేగంపేట విమానాశ్రయంలో జరగనున్న ఏవియేషన్ షో విశేషాలను వెల్లడించేందుకు సోమవారమిక్కడ ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 మరిన్ని విదేశీ సంస్థలు..: భారత్‌లో విమాన సర్వీసులను నడిపేందుకు 10-12 విదేశీ సంస్థలు ఇప్పటికే విమానయాన శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కంపెనీల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. భారత్‌లో ఉన్న సమస్యేమంటే నిర్వహణ వ్యయాలు ఎక్కువ. రూపాయి పతనం ఈ రంగానికి పెద్ద సమస్యగా మారింది. విమాన ఇంధన వ్యయమూ ఎక్కువే. ఇంధనంపై వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటోంది. ఇక పోటీ కారణంగా ఆపరేటర్లు విమాన టికెట్ల ధరలు తగ్గించాయి. చిన్న విమానాశ్రయాలు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భారత పౌర విమానయాన రంగం ప్రస్తుతమున్న ప్రపంచ 9వ ర్యాంకు నుంచి 2020 నాటికి 3వ ర్యాంకుకు వెళ్తుందని మం త్రిత్వ శాఖ ఆశిస్తోంది. విమానాల సంఖ్య 400 నుం చి 1,000కి చేరుతుందని అంచనా. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్‌కు(ఎంఆర్‌వో) హబ్‌గా భారత్ ను తీర్చిదిద్దాలని భావిస్తోంది. హెలిటూరిజంలో రాష్ట్రంతోసహా దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అం దిపుచ్చుకోవడానికి పర్యాటక శాఖతో చర్చిస్తోంది.  
 
 అంబుడ్స్‌మన్‌కు మరో ఏడాది..
 వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేయదలచిన ప్రతిపాదిత ఏవియేషన్ అంబుడ్స్‌మన్ కార్యరూపం దాల్చేందుకు మరో ఏడాది పడుతుందని అశోక్ కుమార్ వెల్లడించారు. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్థానంలో రానున్న సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఎక్కువ అధికారాలు ఉంటాయన్నారు. 7-9 మంది సభ్యులతో ఏర్పాటవుతుందని, ద్రవ్య సంబంధ విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇక ఏవియేషన్ షోలో భాగంగా ఏరోనాటికల్ విద్యార్థులకు జాబ్ ఫెయిర్‌తోపాటు ఉద్యోగావకాశాలపై చర్చిస్తారు. 20 దేశాలకు చెందిన 200 స్టాళ్లు ఏర్పాటవుతున్నాయని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి తెలిపారు. ఎయిర్‌బస్ ఏ380 సజావుగా దిగేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 18 విమానాలు ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు.
 

మరిన్ని వార్తలు