2016 నాటికి 1,500 మెగావాట్లు

31 Jul, 2014 00:51 IST|Sakshi
2016 నాటికి 1,500 మెగావాట్లు

పవన విద్యుత్‌లో మిత్రా ఎనర్జీ లక్ష్యం
 ఏపీ, తెలంగాణలో కొత్తగా 200 మెగావాట్లు: కంపెనీ చైర్మన్ రవి కైలాస్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవన విద్యుత్ రంగ సంస్థ మిత్రా ఎనర్జీ 2016 నాటికి 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో కంపెనీ 527 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసేలా మరో 300 మెగావాట్లను జత చేస్తామని మిత్రా ఎనర్జీ చైర్మన్ రవి కైలాస్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.

ఇందుకు రూ.2,000 కోట్ల దాకా వ్యయం అవుతుందని చెప్పారు. మిత్రా ఎనర్జీ తెలంగాణలో కొత్తగా 100 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనంతపూర్, కర్నూలులో కలిపి 100 మెగావాట్ల ప్రాజెక్టులుండగా, మరో 100 మెగావాట్లు చేరుస్తున్నారు.
 
ఏపీలోనే ధర తక్కువ..: పవన విద్యుత్‌కు ఒక్కో యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.4.70 మాత్రమే చెల్లిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌కు రూ.5.50, సోలార్‌కు రూ.6.50 చెల్లిస్తోంది. పవన విద్యుత్‌కు రాజస్థాన్ రూ.5.63, మహారాష్ట్ర రూ.5.70, మధ్యప్రదేశ్ రూ.5.94 చెల్లిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉందని కంపెనీ ఎండీ విక్రమ్ కైలాస్ అన్నారు.

బొగ్గు ఆధారిత విద్యుత్ మాదిరిగా పవన విద్యుత్‌కూ యూనిట్‌కు రూ.5.50 ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నామని చెప్పారు.‘భారత్‌లో 2 లక్షల మెగావాట్ల పవన విద్యుత్‌కు అవకాశముంది. ప్రస్తుతం 20 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. నాలుగైదు పెద్దవి, ఐదారు చిన్న కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలు, తెలంగాణలో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం  ఉంది’ అని విక్రమ్ అన్నారు.
 
విజేతకు లక్ష డాలర్లు..
ఇన్‌స్పైరింగ్ సొల్యూషన్ పేరుతో స్టార్టప్ విలేజ్, ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్, విల్‌గ్రో సహకారంతో ఒక కార్యక్రమానికి మిత్రా ఎనర్జీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తమ ప్రణాళికను ఎంపిక చేసి, వ్యాపారం ప్రారంభించేందుకు ఒక లక్ష డాలర్లను (రూ.60 లక్షలు) సీడ్ క్యాపిటల్‌గా అందిస్తారు. విజేతను ఆగస్టు 30న ప్రకటిస్తారు. అత్యుత్తమమైతే మరో రెండు ఐడియాలకూ సీడ్ క్యాపిటల్ ఇచ్చేందుకు సిద్ధమని మిత్రా ఎనర్జీ తెలిపింది.

మరిన్ని వార్తలు