మారుతీ కొత్త డిజైర్‌ సందడి

17 May, 2017 00:25 IST|Sakshi
మారుతీ కొత్త డిజైర్‌ సందడి

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘డిజైర్‌’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5.45 లక్షలు–రూ. 9.41 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది హ్యుందాయ్‌ ఎక్సెంట్, హోండా అమేజ్, ఫోర్డ్‌ యాస్సైర్, ఫోక్స్‌వ్యాగన్‌ అమియోలకు గట్టిపోటీనిస్తుందని విళ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్ల ధరలు కూడా రూ.4.7 లక్షలు–రూ.8.41 లక్షల మధ్యలోనే ఉన్నాయి.

‘డిజైర్‌ మోడల్‌ను భారత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించాం. అనతికాలంలోనే ఇండియన్‌ ఆటోమొబైల్‌ రంగంలో ఇది అత్యంత పాపులర్‌ బ్రాండ్‌ స్థాయికి ఎదిగింది. యువతను, సెడాన్‌ కస్టమర్ల కోసం ఇప్పుడు ఇదే మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చాం’ అని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు. కొత్త డిజైర్‌ మోడల్‌కు సంబంధించి కంపెనీకి ఇప్పటికే 33,000 యూనిట్లకు గానూ బుకింగ్స్‌ అందాయని పేర్కొన్నారు. కాగా కంపెనీ తన సప్లయర్స్‌తో కలిసి ఈ మోడల్‌పై రూ.1,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసింది.

ప్రత్యేకతలు
కొత్త డిజైర్‌ వేరియంట్‌ పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇందులో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్, 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. డీజిల్‌ వెర్షన్‌ లీటర్‌కు 28.4 కిలోమీటర్ల మైలేజ్‌ను, పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. మారుతీ ఇప్పటిదాకా దేశంలో 14 లక్షల యూనిట్ల డిజైర్‌ కార్లను విక్రయించింది. డిజైర్‌ మోడల్‌ను 2008 మార్చిలో మార్కెట్‌లోకి వచ్చింది. ఎంట్రీ సెడాన్‌ విభాగంలో మారుతీ సుజుకీ ఆధిపత్యానికి డిజైర్‌ మోడలే ప్రధాన కారణం.

మరిన్ని వార్తలు