2018 బిజినెస్‌ రౌండప్‌ : స్కాంల హోరు, వివాదాల జోరు

27 Dec, 2018 16:07 IST|Sakshi

పెరిగిన డాలర్ - తగ్గిన రూపాయి, మండిన పెట్రోలు - భగ్గుమన్న ధరలు, హెచ్చుతగ్గుల మార్కెట్, మైమరింపించిన పెట్టుబడులు, భారీ రుణాలు - బ్యాంకుల కుంభకోణాలు, బంగారం ధరల దోబూచులాట... లాంటివి అనేకం 2018లో మరిచిపోలేని వాణిజ్య వ్యాపార రంగాల్లో ప్రభావం చూపిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో సాగిన బిజినెస్ పై సాక్షి రౌండప్...!!! 

వణికించిన చమురు : మండిన పెట్రోలు
ఆకాశాన్నంటిన చమురు ధరలు ప్రపంచదేశాలను వణికించాయి. బ్రెంట్‌ ఆయిల్‌ బ్యారెల్‌ 86.74 డాలర్లు వద్ద ఆల్‌ టైం గరిష్టాన్ని తాకింది. దేశీయంగా పెట్రో ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు అక్టోబరులో చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. పెట్రోలు లీటరు ధర ముంబైలో ఏకంగా రూ.90స్థాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వచ్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబరు 22 నాటికి బ్రెంట్‌ ఆయిల్‌ 53.50 డాలర్లకు చేరింది. 

2018 స్టాక్‌మార్కెట్లు :
2017 ఏడాదిలో కీలక సూచీలు బీఎస్‌సీ సెన్సెక్స్‌ 26,494 వద్ద  ఉండగా, 2018 జనవరిలో 36, 957 స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 11వేల రికార్డ్‌ స్థాయిని తాకింది. అయితే ఈ ఏడాది మాత్రం సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ ఏడాదంతా ఒడిదుడుకులను చవి చూసాయి. ఆగస్టులో 38,800 వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీ 11,760 కి ఎగువన నిఫ్టీ చారిత్రక గరిష్టాలను తాకియి. అయితే ఏడాది చివరికి 2018 జనవరి నాటి స్థాయిలోనే కొనసాగుతుండటం విశేషం.

ఉసూరుమనిపించిన రూపాయి :
ఈ ఏడాది జనవరిలో డాలరు మారకంలో రూపాయి 63.8 వద్ద  నిలిచింది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు  ప్రభావంతో 74. 49 వద్ద ఆల్‌టైం  కనిష్టానికి  చేరింది. ఒకదశలో 75 రూపాయల స్థాయిని దాటి పతనంకానుందని ఆందోళన కూడా నెలకొంది. అయితే మళ్లీ చమురు ధరలు కాస్త చల్లబడటంతో రూపాయికి బలమొచ్చింది. అయినా గత ఏడాదితో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ దిగజారింది. ప్రస్తుతం 70రూపాయల స్థాయి వద్ద కొనసాగుతోంది. 

స్మార్ట్‌ఫోన్ల హవా :
స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లలో హల్‌చల్‌ చేశాయి. ప్రధానంగా  భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్‌లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. అందులోనూ షావోమీ డివైస్‌లవైపే యూజర్లు మొగ్గు చూపారు. దీంతో షావోమి నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. అలాగే ఒప్పో, వివో లెనోవా, వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు భారీ విక్రయాలను నమోదు చేశాయి. భారీ స్ర్కీన్లు, అతిపెద్ద స్టోరేజ్‌ కెపాసిటీ, భారీ, డ్యుయల్‌ రియర్‌,  సెల్ఫీ కెమెరా ఈ ఏడాదిలో ప్రముఖంగా నిలిచాయి. 

ఫోల్డబుల్‌ ఫోన్‌ :
ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజాలు శాంసంగ్‌, యాపిల్‌, ఎల్‌జీ, హువావే లాంటి దిగ్గజాలకు షాకిస్తూ చైనాకంపెనీయే ముందుగా ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ రాయ్‌లీ కార్పొరేషన్‌ అనే సంస్థ విడుదల చేసింది.

పడిలేచిన పసిడి :
బంగారానికి డిమాండ్‌ బాగా తగ్గింది. 2018 ఏడాదంతా బులియన్‌ మార్కెట్లో విలువైన లోహాలు వెండి, బంగారం ధరలు అక్కడక్కడే కదలాడాయి. 25 జనవరి 2018న 24 కారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.30,454 గా ఉంది. డిసెంబరు 22 నాటికి స్వల్పంగా పుంజుకుని పది గ్రాముల పుత్తడి  రూ.31,197 గా నిలిచింది. వెండి ధర  మాత్రం బాగా పడిపోయింది. ఏడాది ఆరంభంలో 42 వేలు పలికిన వెండి కిలో ధర డిసెంబరు 22 నాటికి రూ. 37,276  స్థాయికి  చేరింది. 

కుంభకోణంలో చిక్కిన పీఎన్‌బీ :
ఏడాది ఆరంభంలోనే దేశంలో నేషనల్‌ బ్యాంకు కుంభకోణం ప్రకంపనలు రేపింది. బ్యాంకులోని  సీనియర్‌ అధికారులు, ఉద్యోగులతో కుమ్మక్కైన డైమండ్‌ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్‌  చెక్సీ (గీతాంజలి గ్రూప్‌) 13వేల 600 కోట్ల రూపాయలకు బ్యాంకు ముంచేసి విదేశాలు చెక్కేసారు. ఈ కేసులో కేసులు నమోదు, చార్జిషీట్లు, ఆస్తులు స్వాధీనంలాంటి చర్యల్లో సీబీఐ, ఐడీ బిజీగా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్‌ రంగంలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన పీఎన్‌బీ స్కాంలో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ సెగ అది పెద్ద ప్రయివేటు బ్యాంకు  ఐసీఐసీఐని కూడా తాకింది. గీతాంజలి గ్రూపునకు  వేలకోట్ల రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా వివాదంలో ఇరుక్కుంది

ఐసీఐసీఐ వీడియోకాన్‌ కుంభకోణం :
పీఎన్‌బీ కుంభకోణానికి తోడుగా ప్రైవేట్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్‌ రుణ కుంభకోణం బ్యాంకింగ్‌ రంగ నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఈ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్‌ సాయం చేశారని ఆరోపణలు చెలరేగాయి. నిబంధనలు పాటించకుండా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు కొచర్‌ రుణాలిచ్చారని, తద్వారా భర్త దీపక్‌ కొచర్‌, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి  లబ్ది చేకూరిందనేది ప్రధాన ఆరోపణ.  బోర్డు పదేపదే చందా కొచర్‌ అండగా నిలిచినప్పటికీ, తుదకు  చందాకొచర్‌ పదవిని వీడక తప్పలేదు.

భారీ డీల్స్ :
దేశీయ ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌, అంతర్జాతీయ ఆన్‌లైన్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ల మెగా డీల్‌ ఇ-కామర్స్‌ రంగంలో ప్రముఖంగా నిలిచింది. 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండర్లు ఇద్దరూ అనూహ్యంగా కంపెనీని వీడడం విశేషం. డీల్‌ ముగిసిన వెంటనే సచిన్‌ బన్సల్‌ తన వాటాను అమ్ముకొని కంపెనీ నుంచి నిష్ర్కమించారు. అటు మరో ఫౌండర్‌ బిన్సీ బన్సల్‌  కూడా అనివార్య పరిస్థితుల్లో సంస్థకు రాజీనామా చేయాల్సి వచ్చింది. 

వోడాఫోన్‌, ఐడియా డీల్‌ టెలికాం రంగంలో మెగా డీల్‌కు సాక్ష్యంగా నిలిచింది. వోడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ సంస్థలు విలీనమై వోడాఫోన్‌ ఐడియా పేరుతో దేశీయంగా అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించాయి.  తద్వారా టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన జియో దెబ్బతో కుదేలైన దేశీయ అతిపెద్ద టెల్కో ఎయిర్‌టెల్‌ను  మరింత వెనక్కి నెట్టేసింది. 

కీలక నిష్క్రమణ :
శిఖా శర్మ - భారీ నష్టాలు, నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణలు రావడం లాంటి పరిణామాలతో యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖాశర్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2018మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీకాలం ముగియనుండగా, నాలుగవసారి ఆమెను ఎండీగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. అయితే దీనిపై ఆర్‌బీఐ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో​ డిసెంబరు 31,  2018నుంచి బాధ‍్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్‌లో శిఖా శర్మ ప్రకటించారు.

ఉషా అనంత సుబ్రమణియన్ : పీఎన్‌బీ స్కాంకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో అలాహాబాద్ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ పేరు చేర్చడంతో ఆమె పదవిని కోల్పోయారు. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని  కన్సార్టియం 2016లో గీతాంజలి గ్రూప్‌నకు అనుమానాస్పద ఈ రుణాల కేటాయింపులపై (రూ.5,280 కోట్లు)  సీబీఐ అధికారులు ఆమెను చార్జ్‌షీట్‌లో చేర్చారు.

అరుంధతి భట్టాచార్య : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తొలి మహిళా ఛైర్మన్‌గా విజయవంతంగా బాధ్యతలను నిర్వహించిన అరుంధతి భట్టాచార్య అక్టోబర్‌లో 2018లో రిటైర్‌ అయ్యారు. ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసరుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె నాలుగు దశాబ్దాలు పాటు బ్యాంకుకు విశేష సేవలందించారు.  

2018 బిజినెస్ రౌండప్ : బ్యాంకుల విలీనం : 
గత ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకుతోపాటు అయిదు బ్యాంకులను విలీనంచేసిన కేంద్రం, రుణవితరణ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు బ్యాంకులను బలోపేతం చేయడాని కంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రూ.14.82 లక్షల కోట్లతో దేశంలో మూడవ అతిపెద్ద సంస్థగా అవతరించ నుంది.  అయితే ఈ మెర్జర్‌ను బ్యాంకు ఉద్యోగ సంఘాలు  నిరసన తెలిపాయి. 

పరారైన కార్పొరేట్ నేరస్తులు :
విజయ్‌ మాల్యా : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా వ్యవహారం 2018లో బ్రిటన్‌ కోర్టుకు చేరింది. 2016, మార్చిలో మాల్యా  లండన్‌కు పారిపోయిన మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌, బినామీ లావాదేవీల చట్టం ప్రకారం దేశం వదిలి పారిపోయిన మాల్యాను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు నానా తంటాలు పడుతోంది. అయితే తాను బ్యాంకుల వద్ద తీసుకున్న మొత్తం రుణాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాననీ, మీడియానే తన మీద తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాల్యా పాత పాటే పాడుతున్నాడు. 

మరోవైపు బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య 58కి చేరింది. విజయ్‌ మాల్యాతో పాటు  వివిధ స్కాంలలో నిందితులుగా ఉన్న నీరవ్‌ మోదీ, మొహుల్‌ చోక్సీ, నితిన్, చేతన్‌ సందేస్రా, లలిత్‌ మోదీ, యూరోపియన్‌ దళారీ గ్యూడో రాల్ఫ్‌ హస్చకే, కార్ల్‌ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్‌అవుట్‌ సర్క్యులర్స్‌ (ఎల్‌ఒసీ), ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు జారీ చేశామని  కేంద్రం ప్రకటించడం గమనార్హం. అయితే అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్‌ మిషెల్‌ను దేశానికి రప్పించడంలో కేంద్రం విజయం సాధించింది. 

వివాదాల చట్రంలో ఆర్‌బీఐ :
దేశ ఆర్థికరంగానికి ఆయువు పట్టులాంటి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది కూడా తీవ్ర చర్చల్లో నానింది. ముఖ్యంగా కేంద్రం, ఆర్‌బీఐ మధ్య వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. అప్పటివరకు గుంభనంగా ఉన్న విభేదాలు డిప్యూటీ గవర్నర్‌ విరేల్‌ ఆచార్య బహిరంగంగా ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిపై వ్యాఖ్యలు చేయడంతో  ఈ ప్రచ్ఛన్న యుద్ధం మరింత రాజుకుంది. చివరకు గవర్నర్‌ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన గవర్నర్‌గా మాజీ ఆర్థికమండలి సలహా సభ్యుడు శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించింది.

హెచ్చు తగ్గుల మధ్య జీఎస్టీ :
ఒకే దేశం ఒకే పన్ను పేరుతో గత ఏడాది తీసుకొచ్చిన పన్ను సంస్కరణల చట్టం గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ చట్టం రేట్ల శ్లాబులలో మార్పులను ప్రకటించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ పన్ను రేటును తగ్గించినట్టు ప్రకటించింది. 33 వస్తువులను 12, 5 శాతం శ్లాబుల్లోకి, 28 రకాల విలాస వస్తువులపై 28 శాతం జీఎస్టీ రేటుకు జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ఆదాయంపై 55 వేల కోట్ల భారం పడనుందని ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌  జైట్లీ వెల్లడించారు.

ట్రాయ్‌ కొత్త నిబంధనలు : వినియోగదారులపై రెట్టింపు భారం
సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కొత్త కేబుల్ టారిఫ్‌ అమలు కానుందని, డిసెంబర్ 29 తర్వాత  వివిధ ఛానళ్ల  ప్రసారాలు నిలిచిపోతాయనే వార్తలు కేబుల్‌ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. తాజా ఆర్డర్‌తో ఛానల్‌కు 19 రూపాయిలు చొప్పున గరిష్టంగా పెంచుకునే అవకాశం ఇచ్చింది ట్రాయ్‌. 20నెలల ముందే అంటే 2017 మార్చిలోనే ఈ చట్టం వచ్చినప్పటికీ 2018, జులై 3న  వాటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది.  ఈ నెల 29 తర్వాత  కొత్త కేబుల్‌ నిబంధనల వల్ల టీవీ ఛానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని, కొంత సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్‌) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఈ  నిబంధనలను  కేబుల్‌ ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’