మార్కెట్లోకి కే15 పెట్రోల్‌ ఇంజిన్‌ ‘సియాజ్‌’

21 Aug, 2018 00:38 IST|Sakshi

ప్రారంభ ధర రూ.8.19 లక్షలు; మైలేజ్‌ 21.56 కి.మీ.

ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా నుంచి మిడ్‌ సైజ్‌ సెడాన్‌ సియాజ్‌ అధునాతన వెర్షన్‌ సోమవారం విడుదలైంది. 1.5 లీటర్ల కే15 పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈకారు.. లిథియం–అయాన్‌ బ్యాటరీ ఉన్నటువంటి నూతన తరం హైబ్రిడ్‌ టెక్నాలజీతో రూపొందిందని సంస్థ తెలియజేసింది. ఇంతకుముందు వెర్షన్‌లో 1.4 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండగా.. తాజా వెర్షన్‌లో ఇంజిన్‌ సైజ్‌ ఇంకాస్త పెరిగింది.

అధునాతన, హరిత సాంకేతికతకు తమ కంపెనీ ప్రాధాన్యమిస్తోందని వెల్లడించిన సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా.. ఇందుకు అనుగుణంగానే నూతన సియాజ్‌ వెర్షన్‌ను రూపొందించినట్లు చెప్పారు. ‘కస్టమర్ల అభిలాషకు తగిన విధంగా ఉన్నటువంటి ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్‌ వేరియంట్లలో లభిస్తోంది. మాన్యువల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.8.19 లక్షలు – రూ.9.97 లక్షలు కాగా, ఆటోమేటిక్‌ వేరియంట్‌ రూ.9.8 లక్షలు– రూ.10.97 లక్షలుగా ఉంది. లీటరుకు 21.56 కిలో మీటర్ల మైలేజ్‌ వస్తుంది.’ అని చెప్పారాయన.  

రూ.160 కోట్ల పెట్టుబడి: నూతన పెట్రోల్‌ ఇంజిన్, సంబంధిత టెక్నాలజీ అభివృద్ధి కోసం కంపెనీ రూ.160 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌ ఎస్‌ కల్సి వెల్లడించారు. 2014లో విడుదలైన తొలి సియాజ్‌ ఇప్పటివరకు 2,20,000 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపారు. డీజిల్‌ వేరియంట్‌ కొనసాగుతుంది 1.3 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఇంతకుముందు వెర్షన్‌ ఇకమీదట కూడా కొనసాగుతుందని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ వేరియంట్‌ ధర రూ.9.19 లక్షలు– రూ.10.97 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు