సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!

28 Dec, 2018 02:58 IST|Sakshi

టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ లేఖ

7 లక్షల మంది ఉద్యోగులకు న్యూఇయర్‌ సందేశం

గ్రూపు పునర్‌వ్యవస్థీకరణ, సరళీకరణ ప్రస్తావన...

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్‌ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. డిజిటల్‌పై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు.

2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందంటూ... 100 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించడాన్ని ఒకానొక కార్యక్రమంగా ప్రస్తావించారు. ‘‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది.  ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా కొనసాగుతాయి’’అని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ‘‘మన పరుగు ను కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’’ అని సూచించారు.  

కీలక ముందడుగు..: ‘టాటా కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలకమైన ఆస్తుల కొనుగోలు, భవిష్యత్తు వృద్ధికి గాను రూ.70,000 కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని చంద్రశేఖరన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు చెప్పారు.  పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవిగా పేర్కొన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం.  

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఎకోసిస్టమ్‌...
దేశంలో ఎలక్ట్రికల్‌ వాహనాల ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు టాటా మోటార్స్‌... గ్రూపులోని టాటా పవర్, టాటా క్యాపిటల్‌తో కలసి పనిచేస్తుందని చంద్రశేఖరన్‌ చెప్పారు. ‘‘టాటా క్యాపిటల్‌ నుంచి ఆర్థిక సాయం, టాటా పవర్‌ నుంచి చార్జింగ్‌ వసతుల నెట్‌వర్క్‌ విషయమై టాటా మోటార్స్‌ కృషి చేస్తోంది’’ అని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు