లాస్‌ వెగాస్‌ ‘అవతార్‌’ షో!

8 Jan, 2020 01:30 IST|Sakshi
బెంజ్‌... అవతార్‌ కాన్సెప్ట్‌ కారు

లాస్‌ వెగాస్‌: అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ‘2020 కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌)’ అదరగొట్టే ఆవిష్కరణలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి.

మెర్సిడెస్‌ బెంజ్‌ ’ఏఐ’ కాన్సెప్ట్‌ 
సూపర్‌ హిట్‌ హాలీవుడ్‌ సినిమా అవతార్‌ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్‌ కాన్సెప్ట్‌ కారును మెర్సిడెస్‌ బెంజ్‌ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని డిజైన్‌ చేసింది. ఈ అటానమస్‌ వాహనంలో స్టీరింగ్‌ వీల్, పెడల్స్‌ వంటివి ఉండవు. సెంటర్‌ కన్సోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్‌ ఉత్పత్తులతో రూపొందించారు. 
హ్యుందాయ్‌ ఎయిర్‌ ట్యాక్సీ 

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్‌ ట్యాక్సీలను ఎస్‌–ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్‌ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్‌తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

శాంసంగ్‌ ‘డిజిటల్‌ అవతార్‌’ 
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్‌ మనిషి’(డిజిటల్‌ అవతార్‌)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభా షించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్‌ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్‌ అవతార్‌లను సృష్టించవచ్చని, డిస్‌ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్‌ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగానూ వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. 
శాంసంగ్‌ డిజిటల్‌ మనిషి 

మరిన్ని వార్తలు