డాలర్‌ బలం – బంగారం బలహీనం

6 Mar, 2017 00:09 IST|Sakshi
డాలర్‌ బలం – బంగారం బలహీనం

అంతర్జాతీయ మార్కెట్‌లో 23 డాలర్లు డౌన్‌
 దేశీయంగానూ ఇదే ప్రభావం  


న్యూఢిల్లీ/న్యూయార్క్‌: అమెరికా డాలర్‌ బలపడటం అంతర్జాతీయంగా బంగారం ధరను పడగొట్టింది. న్యూయార్క్‌ కమోడిటీ నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్‌ ధర శుక్రవారంతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే ఔన్స్‌కు (31.1గ్రా)– 23 డాలర్లు తగ్గి, 1,234 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి.

డాలర్‌ ఇండెక్స్‌ అప్‌ అండ్‌ డౌన్స్‌...
అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ సోమవారం నాడు 101.09 వద్ద ప్రారంభమయినా,  గురువారం నాటికి భారీగా 102.16 డాలర్లకు చేరింది.అయితే శుక్రవారం ట్రేడింగ్‌ చివరికి 101.34 డాలర్లకు తగ్గి ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న కారణంగా రేటు పెంపు ఖాయమన్న ప్రకటన ఫెడ్‌ చీఫ్‌ యెలెన్‌ నుంచి వెలువడుతుందన్న అంచనాలు డాలర్‌ బలోపేతానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ వారం దూకుడు లేకపోవచ్చు... 15 వరకూ అనిశ్చితి
ఫెడ్‌ అంచనాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన గణాంకాలు వంటి అంశాలు ఉంటే మార్చి 14–15 తేదీల్లో ఫెడ్‌ రేటు పెంపునకు తగిన అవకాశాలు ఉంటాయని శుక్రవారం యెలెన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా పసిడి ధరల దూకుడు కొనసాగకపోవచ్చన్న విశ్లేషణలున్నాయి. మార్చి 15 వరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంబించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దేశీయంగా వారంలో రూ. 160 డౌన్‌.. ‘ఫ్యూచర్స్‌’లో అంతకు మించి
ఇక అంతర్జాతీయంగా ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ధర వారం వారీగా 10 గ్రాములకు రూ.623 తగ్గి, రూ.29,020కి చేరింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.160 తగ్గి రూ.29,295కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,145కు పడింది. వెండి కేజీ ధర రూ.405 తగ్గి రూ.42,850కి పడింది.

క్రూడ్‌పైనా డాలర్‌ ప్రభావం.. మూడు వారాల కనిష్టం...
డాలర్‌ పెరుగుదల ఎఫెక్ట్‌ గురువారం క్రూడ్‌ ధరపైనా కనిపించింది. నైమెక్స్‌ లైట్‌ స్వీట్‌ బ్యారల్‌ ధర గురువారం మూడు వారాల కనిష్ట స్థాయి 52.55 డాలర్లకు పడిపోయింది. శుక్రవారం డాలర్‌ తిరిగి కొంత బలహీనపడడంతో తిరిగి 53.23  డాలర్ల వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు