విశాఖ విమానాశ్రయం.. ఇక 24 గంటల సేవలు

25 May, 2017 01:22 IST|Sakshi
విశాఖ విమానాశ్రయం.. ఇక 24 గంటల సేవలు

గోపాలపట్నం (విశాఖపశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్‌ హోదా సాధించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగనున్నాయి. ఇంతవరకు రాత్రి 11 గంటలతో సర్వీసులు నిలిపివేసే పరిస్థితి ఉండగా... ఇకపై 24 గంటలూ సర్వీసులు నడపినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడి విమానాశ్రయానికి ఇప్పటికే దుబాయ్, సింగపూర్‌ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

తాజాగా కొలంబోకు శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్ధ జులై 8 నుంచి సర్వీసులు అందుబాటులోకి తేబోతోంది.  థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసు వచ్చే అక్టోబరు 29 నుంచి బాంకాక్‌కు ప్రారంభం కాబోతోంది. ఈ విమానం రాత్రి 12.30కి బాంకాక్‌ నుంచి విశాఖకు వచ్చి తిరిగి 1.30కి బ్యాంకాక్‌కు బయలుదేరుతుంది. ఇలా రాత్రి 12 తర్వాత సర్వీసులకు ఇప్పటివరకు అత్యవసరమయితే గాని అనుమతించడంలేదు.

రాత్రి వేళ సర్వీసులకు చర్యలు
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం అర్ధరాత్రి వేళల్లో వచ్చి వెళ్లడానికి ఎయిర్‌పోర్టు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఎయిర్‌పోర్టు డైరెక్టరు ప్రకాష్‌ రెడ్డి  సమీక్షించారు. సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాల సంఖ్య పెంచడానికి తాను ఇప్పటికే కేంద్రానికి నివేదించానని, దీనికి ఆమోదం వచ్చిందని ప్రకాష్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు