సెన్సెక్స్ మద్దతు 27,440

10 Nov, 2014 00:04 IST|Sakshi

మార్కెట్ పంచాంగం
 
అక్టోబర్ ద్వితీయార్థంలో ఉధృతమైన ర్యాలీ నిర్వహించిన భారత్ సూచీలు ఈ నవంబర్ తొలివారంలో విశ్రాంతి తీసుకున్నాయి. ఈ సమయంలోనే ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ పెట్రో కంపెనీలు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కొన్ని బ్యాంకింగ్ షేర్ల  పెరుగుదల కొనసాగడం మార్కెట్‌కు సానుకూలాంశం. రిలయన్స్ గ్రూప్ షేర్లు, కొన్ని పీఎస్‌యూ షేర్లు క్షీణించినందున, సూచీలు మరింత ర్యాలీ జరపలేకపోయాయి. కొన్ని షేర్లు తగ్గినా, మరికొన్ని షేర్లు కొత్త గరిష్టస్థాయిల్ని చేరుతున్నందున మార్కెట్లో పెద్దగా కరెక్షన్ వచ్చే అవకాశాలుండవు. అంతర్జాతీయంగా ఏవైనా నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప భారత్ సూచీలు గరిష్టస్థాయిలోనే స్థిరపడవచ్చు.   ఇక  సాంకేతికాంశాలకొస్తే...

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...

నవంబర్7తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్ వారంలో 28,000 పాయింట్ల శిఖరాన్ని బీఎస్‌ఈ సెన్సెక్స్ అధిరోహించగలిగినా, ఆ స్థాయిపైన స్థిరపడలేక స్వల్ప శ్రేణిలో ఊగిసలాడింది. చివరకు  అంతక్రితం వారంతో పోలిస్తే 3  పాయింట్ల స్వల్పలాభంతో 27,869 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 28,000 స్థాయిని బలంగా ఛేదించలేకపోతే సెన్సెక్స్ స్వల్ప సర్దుబాటుకు లోనుకావొచ్చు. క్షీణత సంభవిస్తే అక్టోబర్ 31నాటి గ్యాప్‌అప్‌స్థాయి 27,440-27,390 శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు శ్రేణి దిగువన ముగిస్తే 27,100-26,900 శ్రేణి వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున క్రమేపీ 26,700 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం 28,000 పాయింట్ల పైన స్థిరపడితే 28,150 పాయింట్ల స్థాయికి పరుగులు తీయవచ్చు. ఆపైన కొద్ది వారాల్లో 28,500-28,600 స్థాయిని అందుకునే ఛాన్స్ వుంటుంది.

నిఫ్టీ తక్షణ నిరోధం 8,360-మద్దతు 8,200

గత మార్కెట్ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా 8,360 పాయింట్ల స్థాయి వద్ద తొలి అవరోధాన్ని ఎదుర్కొన్న ఎన్ ఎస్‌ఈ నిఫ్టీ  చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 15 పాయింట్ల లాభంతో 8,337 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,360 స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే  వేగంగా 8,400 శిఖరాన్ని అధిరోహించవచ్చు. అటుపైన క్రమేపీ రానున్న వారాల్లో 8,500-8,550 శ్రేణిని చేరవచ్చు.  ఈ వారం కూడా నిఫ్టీ 8,360 స్థాయిని ఛేదించలేకపోతే 8,200-8,180 పాయింట్ల శ్రేణి వద్ద బలమైన మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోయి ముగిస్తే క్రమంగా 8,095 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున కొద్దివారాల్లో  7,990పాయింట్ల స్థాయి వరకూ క్షీణించవచ్చు.  
 
 

>
మరిన్ని వార్తలు