ఫ్లిప్‌కార్ట్‌ నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లు

10 Sep, 2019 12:42 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ తన సరఫరా వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే ఆర్డర్లను అంతే వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లను చేర్చుకుంది. దీంతో మరిన్ని ప్రాంతాలకు, కస్టమర్లను చేరుకోవడం కంపెనీకి వీలు పడుతుందని, అదే సమయంలో కిరాణా స్టోర్లకు ఆదాయం పెరుగుతుందని ఫ్లిప్‌కార్ట్‌ తన ప్రకటనలో తెలిపింది.

ముఖ్యంగా రానున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త కస్టమర్లను చేరుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది. ‘‘ఆరు నెలల క్రితమే దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్ల చేరిక మొదలైంది. రానున్న పండుగల సీజన్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నాం.  కిరాణా స్టోర్లు అన్నవి దేశంలో ఎంతో కాలంగా ఉన్న రిటైల్‌ విధానం. డిజిటల్‌ చెల్లింపుల అనంతరం, కిరాణాలో తదుపరి విప్ల వం ఈ కామర్స్‌తో అనుసంధానించడమే’’ అని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి అన్నారు.

>
మరిన్ని వార్తలు