కీలక మద్దతు 28,800

26 Jan, 2015 02:20 IST|Sakshi
కీలక మద్దతు 28,800

మార్కెట్ పంచాంగం
కొద్ది నెలల నుంచి జరుగుతున్న మార్కెట్ ర్యాలీలతో పోలిస్తే క్రితంవారం అప్‌ట్రెండ్ బలంగా వున్నట్లు ఆయా షేర్ల కదలికలు సూచిస్తున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల్లో అంతర్భాగంగా వుండే షేర్లలో 10 శాతం మాత్రమే గత ర్యాలీల్లో కొత్త శిఖరాల్ని చేరుతూవుండేవి.  కానీ ఈ దఫా మూడోవంతు షేర్లు రికార్డుల్ని సృష్టించగలిగాయి.

తాజా ర్యాలీలో బ్యాంకింగ్‌తో పాటు ఫార్మా, సిమెంటు షేర్లు పాలుపంచుకున్నాయి. వచ్చే కొద్దిరోజుల్లో మరిన్ని షేర్లు సూచీలకు అనుగుణంగా నూతన గరిష్టస్థాయిల్ని చేరుతూవుంటే మార్కెట్ ర్యాలీ చెదిరిపోకుండా వుండటమేకాదు. మరింత ఉధృతమవుతుంది.  ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జనవరి 23తో ముగిసినవారం ఐదురోజులూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారిగా 29,000 శిఖరాన్ని అధిరోహించింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,157  పాయింట్ల భారీలాభంతో 29,279 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ ర్యాలీ కొనసాగితే 29,500-600 లక్ష్యాన్ని చేరవచ్చు. రానున్న రోజుల్లో 30,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరాలంటే 29,500-29,600 స్థాయిని దాటాల్సివుంటుంది.

ఇక ఈ వారం కరెక్షన్ జరిగితే 28,800 సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఇదే స్థాయి నుంచి బుధవారం భారీ ట్రేడింగ్ పరిమాణంతో మార్కెట్ పెరగడం, ఇదేస్థాయి నవంబర్ 28నాటి రికార్డుస్థాయి అయినందున, 28,800  దిగువన ముగిస్తేనే తదుపరి క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన మద్దతులు 28,325, 28,200 పాయింట్లు. వచ్చే కొద్దిరోజుల్లో 28,200 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి.
 
నిఫ్టీ మద్దతు 8,690
గత మార్కెట్ పంచాంగంలో సూచించినట్లు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,545 స్థాయిని ఛేదించినంతనే పెద్ద ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 322 పాయింట్లు పెరుగుదలతో 8,836 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ క్షీణిస్తే 8,690 వద్ద ప్రధాన మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు కోల్పోకపోతే 9,000 పాయింట్ల శిఖరాన్ని ఈ వారం చేరవచ్చు. ఆ లోపున 8,880  స్థాయిని తొలుత దాటాల్సివుంటుంది. హెచ్చుతగ్గులు ఏర్పడితే 8,690  దిగువన మద్దతుస్థాయిలు 8,575, 8,530 పాయింట్లు.

జనవరి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా పై స్థాయిలో నిఫ్టీకి ఆప్షన్ బిల్డప్ ఇప్పటివరకూ అల్పంగానే వుంది. 9,000 స్ట్రయిక్ వద్ద మాత్రమే కాస్త ఎక్కువగా 44 లక్షల కాల్ బిల్డప్ వుంది. అలాగే దిగువన 8,700, 8,600, 8,500 స్ట్రయిక్స్ వద్ద 46.5-49 లక్షల మధ్య పుట్ బిల్డప్ ఏర్పడింది. ఈ వారం నిఫ్టీకి సమీపస్థాయిలో పెద్దగా నిరోధం, మద్దతుగానీ వుండకపోవచ్చని, సూచీ స్వేచ్ఛగా కదలవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ వెల్లడిస్తున్నది.

మరిన్ని వార్తలు