డీసీఐని ప్రైవేటీకరించం

14 Jul, 2018 00:27 IST|Sakshi

అవసరమైతే ఆ మూడు పోర్టులకు అప్పగిస్తాం

విశాఖ, ముంబైల్లో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్లు

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (డీసీఐ) ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. డీసీఐ నిర్వహణ బాధ్యతలను విశాఖపట్నం, పారదీప్, న్యూమంగుళూరు పోర్టులకు అప్పగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు.

దేశంలోని మేజర్‌ పోర్టుల చైర్మన్లతో రెండురోజుల సమీక్షా సమావేశం విశాఖలో జరిగింది. సమావేశానంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను మరింత విస్తృతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సమీక్షలో నిర్ణయించామన్నారు.

‘‘కాండ్లా పోర్టులో రెండు వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తాం. ఇది అందుబాటులోకి వస్తే యూనిట్‌ విద్యుత్‌ రూ.11 నుంచి 2.40కి తగ్గుతుంది. కాండ్లా, ట్యుటికోరిన్, పారదీప్‌ పోర్టుల్లో ప్రయోగాత్మకంగా ఉప్పునీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్‌ ప్రాజెక్టును చేపడతాం. దీంతో లీటరు నీరు 3 పైసలకంటే తక్కువకే వస్తుంది. దీన్ని పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తాం’’ అని వివరించారు.

వాడ్రేవులో పోర్టుకు రడీ..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వాడ్రేవులో కొత్తగా పోర్టు నిర్మించే యోచన ఉందని, ఇందుకు 3 వేల ఎకరాలు అవసరమవుతుందని గడ్కరీ చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబును స్థలం అడుగుతామని చెప్పారు. విశాఖ పోర్టు విస్తరణకున్న స్థల సమస్య దృష్ట్యా శాటిలైట్‌ పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా నదిలోనూ క్రూయిజ్‌ను ప్రవేశపెడతామని తెలిపారు. ముంబైలో రెండు, విశాఖలో ఒకటి సముద్రంలో తేలియాడే రెస్టారెంట్లను నిర్మిస్తామన్నారు.

పోర్టులకు అనుబంధంగా ఎస్‌ఈజెడ్‌లు..
మేజర్‌ పోర్టులకు అనుబంధంగా సెజ్‌లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి గడ్కరీ తెలిపారు. అలాగే ప్రతి మేజర్‌ పోర్టులో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయమంత్రులు మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవీయ, రాధాకృష్ణన్, విశాఖ పోర్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు