ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడులు

5 May, 2015 02:08 IST|Sakshi
ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడులు

సానుకూల సెంటిమెంట్ కారణం...
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.7,600 కోట్లు ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. ఏడేళ్ల కాలంలో ఇదే గరిష్ట నికర పెట్టుబడికావడం విశేషం. ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు,  ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండడం.. వీటన్నింటి  ఫలితంగా సానుకూలంగా మారుతున్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లు దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు.

క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ, సెబీ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గత నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో రూ.7,618 కోట్లుగా ఉన్నాయి. 2008, జనవరి తర్వాత ఇదే అత్యధిక మొత్తం. ఆ నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు రూ.7,703 కోట్లుగా ఉన్నాయి. కాగా గత ఏడాది ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రూ.2,698 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయి.
 
ఇదే జోరూ ఈ ఆర్థిక సంవత్సరం కూడా...
ఇక గత నెలలో డెట్‌మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు రూ.28,650 కోట్లకు చేరాయి. గత ఏడాది కాలంగా ఈక్విటీ మార్కెట్‌పై మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఆసక్తి పెంచుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆరేళ్లలో ఇదే తొలి నికర పెట్టుబడులు పెట్టిన ఏడాది కావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లో ఈ భారీ పెట్టుబడుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈక్విటీ, డెట్ మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఇదే విధంగా జోరుగానే ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు