3% తగ్గిన కాగ్నిజంట్‌ నికర లాభం

3 Aug, 2018 01:05 IST|Sakshi

400 కోట్ల డాలర్లకు పెరిగిన ఆదాయం  

న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ, కాగ్నిజెంట్‌ నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో 3 శాతం తగ్గింది. గత ఏడాది జూన్‌ క్వార్టర్‌లో 47 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఇదే క్వార్టర్‌లో 45.6 కోట్ల డాలర్లకు తగ్గిందని కాగ్నిజంట్‌ తెలిపింది. ఆదాయం మాత్రం 360 కోట్ల డాలర్ల నుంచి 400 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్‌ సీఈఓ, వైస్‌ చైర్మన్‌ ఫ్రాన్సిస్కో డిసౌజా తెలిపారు.   ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో ఆదాయం 406 కోట్ల డాలర్ల నుంచి 410 కోట్ల డాలర్లకు పెరగగలదని అంచనాలున్నాయని డిసౌజా తెలిపారు.  

అలాగే ఈ పూర్తి ఏడాదికి ఆదాయం 1,605 కోట్ల డాలర్ల నుంచి 1,630 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నామన్నారు.  డిజిటల్‌ సర్వీసులు, సొల్యూషన్లకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నామని,  వృద్ధికి తగినన్ని పెట్టుబడులు కేటాయిస్తామని, ఆర్థిక లక్ష్యాలను సాధిస్తామనే ధీమాను ఆయన  వ్యక్తం చేశారు.  అమెరికాకు చెందిన ఈ కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి భారత్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులున్నారు. ఈ జూన్‌ క్వార్టర్‌లో కొత్తగా 7,500 మందికి ఉద్యోగాలిచ్చామని, దీంతో ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,68,900కు పెరిగిందని కంపెనీ పేర్కొంది.    

మరిన్ని వార్తలు