ఈ 3 షేర్ల దూకుడుకు కారణమేంటట?

8 Jun, 2020 13:32 IST|Sakshi

జాబితా ఇలా..

టైటన్‌ కంపెనీ

యస్‌ బ్యాంక్‌

వొడాఫోన్‌ ఐడియా

ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో పరుగు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 256 పాయింట్లు పెరిగి 34,543కు చేరగా.. నిఫ్టీ 64 పాయింట్లు పుంజుకుని 10,206 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న వార్తల కారణంగా టైటన్‌ కంపెనీ, యస్‌ బ్యాంక్‌, వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

టైటన్‌ కంపెనీ
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ప్రస్తుతం టైటన్‌ కంపెనీ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం పెరిగి రూ. 1025 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,050 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. జ్యువెలరీ, ఐవేర్‌, వాచీలు తదితర లైఫ్‌స్టైల్‌ ప్రొడక్టుల ఈ కంపెనీ అమ్మకాలు ఇటీవల లాక్‌డవున్‌ నేపథ్యంలో నీరసించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పసిడి ధరలు పుంజుకోవడంతో మార్క్‌టు మార్కెట్‌ క్యాష్‌ఫ్లో పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్టోర్లను తిరిగి తెరుస్తున్న కారణంగా అమ్మకాలు గాడిన పడగలవన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు.

యస్‌ బ్యాంక్‌ 
యస్‌ బ్యాంకుకు చెందిన రూ. 18,000 కోట్ల బాండ్లకు BBB రేటింగ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్రిసిల్‌ తాజాగా పేర్కొంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ దన్ను కారణంగా యస్‌ బ్యాంక్‌ జారీ టైర్‌-2, ఇన్‌ఫ్రా బాండ్లకు స్టేబుల్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు తొలుత 10 శాతం జంప్‌చేసి రూ. 32ను తాకింది. ఇది 10 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 30.4 వద్ద ట్రేడవుతోంది. 

వొడాఫోన్‌ ఐడియా
వరుసగా 10వ సెషన్‌లోనూ మొబైల్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ జోరు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 12.6ను తాకింది. ప్రస్తుతం 11.5 శాతం ఎగసి రూ. 11.7 వద్ద ట్రేడవుతోంది. గత 10 రోజుల్లోనూ ఈ కౌంటర్‌ 129 శాతం ర్యాలీ చేయడం విశేషం! గత 26న ఈ షేరు రూ. 5.5 వద్ద ట్రేడైన సంగతి తెలిసిందే. కాగా.. టెక్‌ దిగ్గజం గూగుల్‌ వొడాఫొన్‌ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి గతేడాది జులైలో చేపట్టిన రైట్స్‌ ఇష్యూ ధర రూ. 12.5ను తాజాగా అధిగమించినట్లు తెలియజేశారు. ఈ అంశాన్ని కంపెనీ తోసిపుచ్చినప్పటికీ.. ఇటీవల దేశీయంగా మొబైల్‌ టారిఫ్‌ల పెంపు.. వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) మెరుగుపడటం వంటి అంశాలు మొబైల్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు చెబుతున్నారు. 

>
మరిన్ని వార్తలు