300మి.ట. ఉక్కు ఉత్పత్తి సాధ్యమే

22 Aug, 2014 01:09 IST|Sakshi
300మి.ట. ఉక్కు ఉత్పత్తి సాధ్యమే

సాక్షి,విశాఖపట్నం: 2025 నాటికి దేశంలో ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు చేరుకోవడం అసాధ్యమేం కాదని వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదన్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి అనేక సానుకూల అంశాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నంలో గురువారం ‘ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ విజన్- 2025’ అనే అంశంపై రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి మధుసూదన్ ముఖ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తలసరి ఉక్కు వినియోగం 60కేజీలు ఉండగా, చైనాలో 500 కేజీలు, అంతర్జాతీయ సరాసరి  225 కేజీలు ఉందన్నారు.

ఈనేపథ్యంలో దేశీయంగా ఉక్కు ఉత్పత్తికి భారీగా అవకాశం ఉందని విశ్లేషించారు. ఉక్కు ఉత్పత్తి,వినియోగంలో చైనాతో భారత్ పోటీపడాల్సి ఉందన్నారు. ఏ దేశానికి లేనవిధంగా దేశంలో ఇనుప గనులు భారీగా ఉన్నాయని,ఇది దేశీయ ఉక్కు రంగానికి వరంగా పరిగణించాలన్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి 1.5టన్నుల ఇనుప ఖనిజం అవసరం ఉందని, భవిష్యత్తులో సాధించాల్సి ఉన్న  300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి   450 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం కావాలని చెప్పారు. అనంతరం సర్డా మెటల్స్ అండ్ అల్లాయిస్ డెరైక్టర్ మనిష్‌సర్డా,స్టాల్‌బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బిమల్ కే సర్కార్, స్టీల్‌ప్లాంట్ మాజీ సీఎండీ శివసాగరరావు, ఆర్‌ఐఎన్‌ఎల్ ప్రస్తుత డెరైక్టర్ డి.ఎన్.రావు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఎండీ వి.కె.నొవాల్ తదితరులు ప్రసంగించారు. భారత్ జీడీపీ వృ ద్ధి రేటు 9శాతానికి చేరుకోవాలంటే ఉక్కు రంగానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత కల్పించాలని వీరంతా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు