గృహ ప్రవేశానికి రెడీగా 34,700 ఫ్లాట్లు

10 Mar, 2018 04:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  2017 ముగింపు నాటికి హైదరాబాద్‌లో 28,000 ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) తెలిపింది. గతేడాది నగరంలో నివాస సముదాయం కంటే కార్యాలయాల విభాగం గణనీయమైన వృద్ధిని సాధించిందని పేర్కొంది. వచ్చే ఆరేడు నెలలు నివాస విభాగం డిమాండ్‌ బాట పడుతుందని.. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, మెట్రో రైలు, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాట్లు వంటి వాటితో ఫ్లాట్లకు డిమాండ్‌ పెరుగుతుందని వివరించింది.  

గతేడాది డిసెంబర్‌ ముగింపు నాటికి హైదరాబాద్, కోల్‌కతా, పుణె, ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై, బెంగళూరు ఏడు నగరాల్లో 4.4 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని జేఎల్‌ఎల్‌ నివేదిక  వెల్లడించింది. ఏడు ప్రధాన నగరాల్లో నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశానికి సిద్ధంగా 34,700 ఫ్లాట్లున్నాయని పేర్కొంది.


ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లోనే ఎక్కువ
మొత్తం అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్లలో 60% ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లోనే ఉన్నాయి. ఇక్కడ 1,50,654 ఫ్లాట్లు న్నాయి. అత్యల్పంగా కోల్‌కతాలో 26 వేల యూనిట్లు విక్రయానికి ఉన్నాయి.

చెన్నైలో 42,500 అమ్ముడుపోకుండా ఉంటే, 8,500 యూనిట్లు గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయి. బెంగళూరులో 70 వేల యూనిట్లు విక్రయానికి నోచుకోకుండా ఉంటే, 10 వేల యూనిట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైలో 86 వేలు, ఫుణేలో 36 వేల యూనిట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి.

మరిన్ని వార్తలు