4 వారాల కనిష్టానికి రూపాయి

9 Jun, 2015 01:35 IST|Sakshi
4 వారాల కనిష్టానికి రూపాయి

33 పైసలు డౌన్; 64.08 వద్ద క్లోజ్
ముంబై:
బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడంతో రూపాయి మారకం విలువ సోమవారం గణనీయంగా తగ్గింది. 33 పైసలు క్షీణించి 64.08 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు తరలిపోతుండటం వల్ల స్టాక్ మార్కెట్ క్షీణిస్తున్న ప్రభావం కూడా రూపాయిపై ఉంటోందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు. గత నెల అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు మెరుగుపడటంతో.. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు గణనీయంగా బలపడింది. జపాన్ యెన్‌తో పోలిస్తే 13 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ఆ ప్రభావం సోమవారం మిగతా మార్కెట్లలోనూ పడింది. చివరిసారిగా ఈ ఏడాది మే 12న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 64.17 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. స్పాట్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 63.75-64.40 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.

మరిన్ని వార్తలు