హెచ్‌డీఎఫ్‌సీ లాభం 4,196 కోట్లు

28 Jan, 2020 05:25 IST|Sakshi

24 శాతం వృద్ధి

5 లక్షల కోట్లకు ఎగసిన రుణాలు

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3,377 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.4,196 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.24,653 కోట్ల నుంచి రూ.29,073 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్‌ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ వెల్లడించారు. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం నాలుగు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.

గత క్యూ3లో రూ.2,114 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.8,372 కోట్లకు ఎగసిందని తెలిపారు.  గృహ్‌ ఫైనాన్స్‌లో 9.9 శాతం వాటాకు సమానమైన 15.9 కోట్ల షేర్లను బంధన్‌ బ్యాంక్‌కు కేటాయించిన కారణంగా రూ.9,020 కోట్ల లాభాన్ని సాధించింది. ఇది నోషనల్‌ (భావాత్మక) లాభమేనని, కానీ ఖాతా పుస్తకాల పరంగా లెక్కల్లో చెప్పడం తప్పనిసరి అని వివరించారు. రుణాలు తొలిసారిగా రూ.5 లక్షల కోట్ల మైలురాయిని దాటాయని మిస్త్రీ వెల్లడించారు. ఫలితాల్లో మరిన్ని వివరాలు ఇవీ...

నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతం  
స్టాండ్‌అలోన్‌ పరంగా ఆదాయం రూ.10.582 కోట్ల నుంచి రూ.20,291 కోట్లకు పెరిగింది. వ్యక్తిగత రుణాలు 24 శాతం ఎగిశాయి. గత రెండు క్వార్టర్లలో ఉన్నట్లుగానే నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతంగా నమోదైంది. ఇక నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,297 కోట్లకు ఎగబాకింది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నా, ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్నప్పటికీ... సంస్థ స్థూల మొండి బకాయిలు 1.36 శాతం(రూ.5,950 కోట్లు) రేంజ్‌లోనే ఉన్నాయి.

వ్యక్తిగత రుణాలకు సంబంధించిన మొండి బకాయిలు మాత్రం స్వల్పంగా 2 బేసిస్‌ పాయింట్లు పెరిగి 0.75 శాతానికి చేరాయి. సగటున నెలకు 9,400 గృహ రుణాలను మంజూరు చేస్తోంది. నిబంధనల ప్రకారం రూ.3,624 కోట్ల కేటాయింపులు ఉండాల్సి ఉండగా, రూ.9,934 కోట్ల మేర కేటాయింపులు జరిపింది.
మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ 2.2 శాతం నష్టంతో రూ.2,396 వద్ద ముగిసింది. ఇది 16 వారాల కనిష్ట స్థాయి.

>
మరిన్ని వార్తలు