ఎల్‌జీ ‘దేశీ’ మంత్రం!

4 Mar, 2014 01:41 IST|Sakshi
ఎల్‌జీ ‘దేశీ’ మంత్రం!

 ఢిల్లీ నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి: భారతీయుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అందించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇన్వర్టర్లతో కూడిన ఫైవ్ స్టార్ రిఫ్రిజరేటర్లు, రసాయనాల అవసరం లేకుండా దోమలను నిర్మూలించేలా పనిచేసే ఏసీలను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న 232కి పైగా కొత్త ఉత్పత్తులను ఢిల్లీలో ‘ఎల్‌జీ టెక్ షో 2014’ పేరిట జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ప్రదర్శించింది.

 ఈ సందర్భంగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సూన్ క్వాన్ మాట్లాడుతూ ఈ ఏడాది పరిశోధనల కోసం రూ.300 కోట్లు, బ్రాండ్ బిల్డింగ్ కోసం రూ.500 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఇండియాలో ఎల్‌జీ వ్యాపారం పరిమాణం రూ.22,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తాము అభివృద్ధి చేసిన ‘మస్కిటో అవే’ ఎయిర్ కండీషనర్లు ఈ రంగంలో సంచలనం సృష్టిస్తాయన్న నమ్మకాన్ని సూన్ వ్యక్తం చేశారు. ధ్వని తరంగాల ద్వారా దోమలను పారద్రోలేలా వీటిని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రసాయనాల ఆధారంగా పనిచేసే మస్కిటో కాయిల్స్, లిక్విడ్ కిల్లర్స్ మార్కెట్ పరిమాణం రూ.4,000 కోట్లుగా ఉందన్నారు.

 ఆ...టీవీనే ప్రధాన ఆకర్షణ
 ఈ ఏడాది ఎల్‌జీ టెక్‌షోలో ప్రపంచంలోనే మొట్టమొదటి 77 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ కర్వ్‌డ్ ఓలెడ్ టీవీనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్ట్రాహెచ్‌డీ, ఓలెడ్ టెక్నాలజీతో కూడిన ఈ టీవీని మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఎల్‌జీ మార్కెటింగ్ హెడ్ (హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్) రిషి టండన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 అంగుళాల టీవీ ధర రూ.9 లక్షలుగా ఉందని, ఈ 77 అంగుళాల టీవీ ధరను ఇంకా నిర్ణయించలేదన్నారు.  దేశంలో టీవీల అమ్మకాల్లో వృద్ధి బాగుందని ఈ ఏడాది 25 లక్షల టీవీలను విక్రయించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గతేడాది 15 లక్షల టీవీలను విక్రయించారు. ఇండియా మొత్తం మీద అమ్ముడవుతున్న టీవీల సంఖ్య ఈ ఏడాది 70 లక్షల నుంచి 85 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు టండన్ తెలిపారు. ప్రస్తుతం దేశీయ టీవీల మార్కెట్లో 24%గా ఉన్న ఎల్‌జీ వాటా ఈ ఏడాది 30 శాతానికి చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

 2 వారాల్లో 4జీ స్మార్ట్‌ఫోన్
 స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌పై దృష్టిపెట్టిన ఎల్‌జీ.. 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 4జీ ఎల్‌టీఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘జీ2’ ను 2 వారాల్లో వాణిజ్యపరంగా దేశీ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఎల్‌జీ మొబైల్ డివిజన్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. 16జీబీ స్మార్ట్‌ఫోన్ ధరను రూ46,000గాను, 32జీబీ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 49,000గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.1,000 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం ఈ ఏడాది రూ.3,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొత్తం దేశీయ స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలో 10% మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుజ్రాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు