భారత్‌లో పేరుకే 4జీ... స్పీడ్‌ వెరీ పూర్‌

2 Mar, 2018 19:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్లు 4జీ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి భారత్‌ దూసుకుపోతున్నప్పటికీ డేటా డౌన్‌లోడ్‌లో స్పీడ్‌ మాత్రం వెరీ పూర్‌. ఓపెన్‌ సిగ్నల్‌ సంస్థ డేటా విశ్లేషకుల అంచనాల ప్రకారం 4జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రపంచ దేశాల్లో భారత్‌ 14వ స్థానంలో ఉంది. మొదటి ఐదు స్థానాల్లో దక్షిణ కొరియా, జపాన్, నార్వే, హాంకాంగ్, అమెరికా దేశాలు కొనసాగుతున్నాయి. ఎవరు ఎక్కువ నెట్‌వర్క్‌ సమయాన్ని ఉపయోగిస్తున్నారన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ ర్యాంకులను అంచనా వేశారు.
 
నెట్‌వర్క్‌ సమయంలో 86. 26 శాతం సమయాన్ని భారతీయ వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. దక్షిణ కొరియా 97.49 శాతం, జపాన్‌ 94.7 శాతం, నార్వే 92.16 శాతం, హాంకాంగ్‌ 90.34 శాతం, అమెరికా వినియోగదారులు 90.32 శాతం సమయం వినియోగించుకుంటున్నారు. భారత్‌లో 4జీ డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ సెకనుకు 6.07 మెగాబైట్లు మాత్రమే. ఇది దక్షిణ కొరియాలో 37.5 మెగాబైట్లు, నార్వేలో 34.8, హంగేరిలో 31, సింగపూర్‌లో 30, ఆస్ట్రేలియాలో 26.3 మెగాబైట్ల వేగంతో ఉన్నాయి. నెట్‌వర్క్‌ సమయాన్ని ఉపయోగించడంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న నార్వే 4జీ డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో మాత్రం ప్రపంచంలో 38వ స్థానంలో కొనసాగుతోంది. దాని 4జీ డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ సెకనుకు 12 మెగాబైట్లు. ఇక 12. 6తో హాంకాంగ్‌ 35వ స్థానంలో, 12.48 మెగాబైట్లతో అమెరికా 37వ స్థానంలో కొనసాగుతోంది. 

ఇక భారత్‌ మాత్రం 6.07 శాతం స్పీడ్‌తో 77వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఇంతవరకు 4జీ సర్వీసుల్లో సెకనుకు 50 మెగా బైట్ల మైలురాయిని ఏ దేశమూ దాటలేదు. కొన్ని టెలికమ్‌ కంపెనీలు తాము ఈ స్పీడ్‌ను దాటేశామని చెబుతున్నప్పటికీ.. 46.6 మెగాబైట్లతో సింగపూర్, 45.9 స్పీడ్‌తో దక్షిణ కొరియా టెలికాం కంపెనీలు దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే నిరంతరాయంగా ఆ స్పీడ్‌ కొనసాగడం లేదు. ఏ దేశంలోనైనా డేటా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఎల్‌టీఈ (లాంగ్‌ టెర్మ్‌ ఎవొల్యూషన్‌)కి ఎంత స్పెక్ట్రమ్‌ కేటాయించారు? ఎల్‌టీఈ అడ్వాన్స్‌డ్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని 4జీకి ఉపయోగిస్తున్నారా? నెట్‌వర్క్‌ సాంద్రత ఎంత ? ఆ నెట్‌వర్క్‌లో రద్దీ ఎంత? అన్న అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను పెంచే వాయు తరంగాల ఖరీదు చాలా ఎక్కువ.
 
ఖరీదు ఎక్కువన్న కారణంగానే 2016లో భారత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెక్ట్రమ్‌ వేలం పాటను టెలికమ్‌ కంపెనీలు బహిష్కరించాయి. ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ల కోసం ప్రీమియర్‌ 700 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్టమ్‌ విక్రయాన్ని యూనిట్‌కు 11,485 కోట్ల రూపాయలను కనీస మొత్తంగా నిర్ణయించడమే బహిష్కరణకు కారణం. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని టెలికమ్‌ కంపెనీలు అడ్వాన్స్‌డ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఎల్‌టీఈకి ఎయిర్‌టెల్‌ 2300 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తుండగా, రిలయన్స్‌ నెట్‌వర్క్‌ తన జియో స్కీమ్‌కు 1800 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెల్సింది. అయితే అధికారికంగా రిలయన్స్‌ అదేమి చెప్పడం లేదు. జియో రాకతో నెట్‌వర్క్‌లో రద్దీ పెరిగి డేటా స్పీడ్‌ కూడా పడిపోయింది. దీంతో డేటా స్పీడ్‌ను పెంచి, కాల్‌డ్రాప్స్‌ను తగ్గించడం కోసం రిలయెన్స్‌ సంస్థ దేశంలో రెండు లక్షల బహిరంగ వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేస్తోంది. 

మరిన్ని వార్తలు