యస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రేసులో 10 మంది బ్యాంకర్లు..

17 Nov, 2018 01:02 IST|Sakshi

ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ కొత్త సీఈవో పదవి రేసులో దాదాపు 5–10 మంది బ్యాంకర్లున్న ట్లు తెలుస్తోంది. సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ షార్ట్‌ లిస్ట్‌ చేసిన వారిలో ఒక విదేశీ బ్యాంక్‌ (ఎంఎన్‌సీ) చీఫ్‌తో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అధిపతి, మరికొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల హెడ్స్‌  ఉన్నట్లు సమాచారం. లిస్టులో 5–10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అంతిమంగా షార్ట్‌లిస్ట్‌లో అయిదుగురే ఉంటారని పేర్కొన్నాయి.

వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో రాణా కపూర్‌ స్థానంలో కొత్త సీఈవో పేరును.. డిసెంబర్‌ మూడో వారంనాటికే ఖరారు చేసే అవకాశం ఉందని వివరించాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఇందుకు జనవరి 31దాకా గడువిచ్చింది.  బయటి వారినే కాకుండా యస్‌ బ్యాంక్‌లో అంతర్గతంగా సీనియర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్స్‌ అయిన రజత్‌ మోంగా, ప్రళయ్‌ మండల్‌ పేర్లను కూడా సెర్చి కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. వీరినింకా ఇంటర్వ్యూ చేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

సెర్చి కమిటీ నుంచి ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ ఓపీ భట్‌ తప్పుకోవడంపై వివరణనిచ్చాయి. లిస్టులోని ఓ బ్యాంకరుకు చెందిన విదేశీ బ్యాంకుకు భట్‌ గతంలో సలహాదారుగా సేవలందించారని తెలిపాయి. దీంతో సీఈవో ఎంపిక నిర్ణయంపై తన ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో సెర్చి కమిటీ నుంచి భట్‌ తప్పుకున్నట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. కాంపిటీషన్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ అశోక్‌ చావ్లా, ఓపీ భట్‌ల నిష్క్రమణతో సెర్చి కమిటీలో ఒక్కరు మాత్రమే బయటి సభ్యుడు (బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ చీఫ్‌ టీఎస్‌ విజయన్‌) మిగిలారని సంబంధిత వర్గాలు వివరించాయి.

కాగా యస్‌ బ్యాంక్‌ నష్టాలు కొనసాగాయి. రాణా కపూర్‌ స్థానంలో సీఈఓను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ఓపీ భట్‌ రాజీనామా చేయడంతో ఈ షేర్‌ 7.1 శాతం నష్ట పోయి రూ.191 వద్దకు చేరింది. విజయ మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన కేసు విషయంలో సీబీఐ చార్జ్‌షీట్‌లో పేరు ఉండటంతో భట్‌ రాజీనామా చేశారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా కారణంగా ఈ షేర్‌ గురువారం కూడా 7 శాతం నష్టపోయింది.   

మరిన్ని వార్తలు