సిండికేట్ బ్యాంక్ స్కామ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్

9 Mar, 2016 01:30 IST|Sakshi
సిండికేట్ బ్యాంక్ స్కామ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్

వెయ్యి కోట్ల ఫ్రాడ్‌పై బ్యాంకు శాఖల్లో సోదాలు
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి సిండికేట్ బ్యాంక్ శాఖల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. జైపూర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉదయ్‌పూర్‌లోని పది చోట్ల సోదాలు జరిపిన సీబీఐ అయిదుగురు అధికారులు, నలుగురు వ్యాపారవేత్తలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. బ్యాంక్ సిబ్బందితో కుమ్మక్కై రాజస్తాన్‌లో సిండికేట్ బ్యాంక్‌కి చెందిన మూడు శాఖల్లో వీరు ఏకంగా 386 ఖాతాలు తెరిచారని ... నకిలీ చెక్కులు, లెటర్ ఆఫ్ క్రెడిట్‌లు, ఎల్‌ఐసీ పాలసీలతో రూ. 1,000 కోట్ల మోసానికి పాల్పడ్డారని అభియోగాలు చేసింది.

2011-16 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ అవకతవకలు బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా సాధ్యపడేవి కావని సీబీఐ వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్తలు నకిలీ చెక్కులు డిపాజిట్ చే సి, ఆ తర్వాత వాటిని డిస్కౌంటింగ్‌పై క్యాష్ చేసుకునేవారని (ఉదాహరణకు చెక్కు విలువ రూ. 100 అయితే, డిస్కౌంటు పోగా తక్షణం రూ.90 చేతికి వస్తుంది) వివరించాయి. ఎక్కువగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల విలువ చేసే చెక్కులు జమయ్యేవని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ సోదాల దరిమిలా బుధవారం ఎన్‌ఎస్‌ఈలో సిండికేట్ బ్యాంక్ షేరు ధర 1.78 శాతం క్షీణించి రూ. 60.75 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు