ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డంకులు తొలగించాలి

25 Oct, 2014 00:31 IST|Sakshi
ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డంకులు తొలగించాలి

ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్
వాషింగ్టన్: అనేక నియంత్రణలు, నిబంధనలు, బొగ్గు.. విద్యుత్ కొరత మొదలైనవి భారత్‌లో ప్రైవేట్ పెట్టుబడులకు అవరోధాలుగా ఉన్నాయని  ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. దేశం అధిక వృద్ధి బాట పట్టాలంటే, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలంటే వీటిని తొలగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధికి (ఐఎంఎఫ్) ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రాపర్టీ హక్కులు పరిరక్షించడం, కాంట్రాక్టులకు భద్రత కల్పించడం, మెరుగైన గవర్నెన్స్ తదితర అంశాలు భారత ఎకానమీకి అవసరమని  సుబ్రమణియన్  తెలిపారు. ‘ప్రైవేట్ రంగం మరింత పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది. కాబట్టి ప్రైవేట్ రంగం ఎదగకుండా, ఉపాధి కల్పనకు అడ్డంకిగా నిలుస్తున్న అనేకానేక నియంత్రణాపరమైన ఆటంకాలను తొలగించాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు.

తగినంత బొగ్గు, విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల గానీ కంపెనీలు రుణభారంతో సతమతమవుతుండటం వల్ల గానీ పలు ప్రాజెక్టులు నిల్చిపోయాయని సుబ్రమణియన్ తెలిపారు. వీటిని సరిచేస్తే ప్రైవేట్ పెట్టుబడులు, వృద్ధి మెరుగుపడగలవన్నారు. అలాగే ఎక్కడ న్యాయవివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందోనన్న భయంతో బ్యూరోక్రాట్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆయన చెప్పారు.  కనుక వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని, అలాగే  బొగ్గు, విద్యుత్ సమస్యల పరిష్కారంపైనా, మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రధానంగా దృష్టి సారించాలని  సుబ్రమణియన్  అభిప్రాయపడ్డారు.  
 
5 శాతం వృద్ధి రేటు సరిపోదు..

భారత్ ఎదగాలన్నా, భారీ జనాభాకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా 5 శాతం రేటు వృద్ధి రేటు సరిపోదని సుబ్రమణియన్ చెప్పారు. సవాళ్లన్నీ అధిగమించాలంటే మళ్లీ ఏడున్నర-ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని.. దాదాపు పది నుంచి ఇరవై ఏళ్ల పాటు దీన్ని కొనసాగించగలగాలని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో ఒక రకంగా విధానపరమైన జడత్వం ఉన్న భావన నెలకొందన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఇటువంటి సమస్యలను పరిష్కరించగలదన్న భావనతో కొంత మేర ఆశాభావం ఉందన్నారు.

మరిన్ని వార్తలు