ఆ ప్రకటనలపై కొరడా.. భారీ జరిమానా, జైలు

7 Feb, 2020 09:46 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: అసత్యాలు, అభూత కల్పనలతో వ్యాపార ప్రకటనలు గుప్పించే వారిపై ఇకపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. కొన్ని రకాల రుగ్మతలు, వ్యాధులకు మేజిక్‌ రెమిడీల పేరుతో ప్రకటనల ద్వారా వినియోగదారులను మభ్యపెట్టాలని చూస్తే ఇకపై భారీ జరిమానా, కఠిన శిక్షలు అమలు చేసేందుకు యోచిస్తోంది. ఈ మేరకు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల చట్టం, 1954)కు ముసాయిదా సవరణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల మేరకు నిబంధనలను ఉల్లఘించిన సదరు సంస్థలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించనుంది. ఈ జాబితాలో 78 రకాల వ్యాధులను చేర్చింది. వీటిపై ప్రకటనలను నిషేధించనుంది.

ముఖ్యంగా ఎయిడ్స్‌ వ్యాధి నివారణ, శరీరం, ముఖం రంగును మార్చే క్రీములు (ఫెయిర్‌ నెస్‌,స్కిన్‌ టోన్‌) లైంగిక  సామర్థ్యం మెరుగుదల, యాంటీ ఏజింగ్‌ క్రీమ్‌, అకాల వృద్ధాప్యం,  మహిళల్లో వంధ్యత్వం, జుట్టు తెలబడటం లాంటివి ముసాయిదా సవరణ చట్టంలో  చేర్చింది. ఈ రుగ్మతలకు సంబంధించిన ఉత్పత్తులు, షరతులు ఏవైనా నయం చేసే మందులు, ‘మేజిక్ రెమెడీస్’ లాంటివి ప్రచారం చేయరాదని చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం, మొదటి ఆరోపణ రుజువైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10 లక్షల వరకు జరిమానా లేదా రెండూ శిక్షార్హమైనవి. తదుపరి నేరారోపణకు, రూ.50 లక్షల వరకు జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ సవరణ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ప్రజల నుండి, వాటాదారుల నుండి సూచనలు, సలహాలు అభ్యంతరాలను కోరాలని అధికారులు నిర్ణయించారు. ఈ నోటీసు జారీ చేసిన తేదీ నుండి 45 రోజులలోపు వాటిని అందించాల్సి వుంటుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా