ఫార్మా కళకళ.. ఇన్‌ఫ్రా వెలవెల

19 Aug, 2014 02:50 IST|Sakshi
ఫార్మా కళకళ.. ఇన్‌ఫ్రా వెలవెల

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రమోటర్లు నెలకొల్పిన దేశీయ ఫార్మా, ఇన్‌ఫ్రా రంగాలు రెండూ భిన్న ధ్రువాల్లో పయనిస్తున్నాయి. ఇందులో ఫార్మా రంగం లాభాలను పెంచుకుంటూ, కొత్త కంపెనీలు, ప్రొడక్టులను ప్రవేశపెడుతూ వేగంగా దూసుకుపోతుంటే,  గతంలో ఒక వెలుగు వెలిగిన ఇన్‌ఫ్రా కంపెనీలకు నష్టాలు అంతకంతకూ పెరుగుతుండటమే కాకుండా అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికి ఆస్తులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్థానిక ప్రమోటర్ల ఫార్మా కంపెనీల్లో ఈ తొలి త్రైమాసిక నికరలాభాల్లో 50 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. మరోపక్క ఇన్‌ఫ్రా రంగానికి చెందిన ప్రధాన కంపెనీల నష్టాలు రెట్టింపు కావడం గమనార్హం.

 ఫార్మా జోరు??
 హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీలకు ఈ తొలి త్రైమాసికం బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అరబిందో ఫార్మా నికరలాభం ఏకంగా 20 రెట్లు పెరిగితే, డాక్టర్ రెడ్డీస్, నాట్కో, గ్రాన్యూల్స్ వంటి ప్రధాన కంపెనీల లాభాలు 50 శాతం పైనే పెరిగాయి. యూరప్‌లోని యాక్టావిస్ కంపెనీని కొనుగోలు చేయడంతో అరబిందో కంపెనీ నికరలాభం రూ. 19 కోట్ల నుంచి ఏకంగా రూ. 415 కోట్లకు పెరిగింది.

గతేడాదితో ఈ ఫలితాలను పోల్చి చూడలేము కాని ఇదే సమయంలో అమెరికా, యూరప్ మార్కెట్ల ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయిందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. ఇదే బాటలో మరో ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ కూడా ఆక్టస్ కంపెనీని కొనుగోలు చేయడంతో కంపెనీ లాభం రూ. 15 కోట్ల నుంచి రూ. 23 కోట్లకు పెరిగింది. గత పన్నెండు నెలలుగా ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గడం కూడా ఫార్మా కంపెనీల లాభాలు పెరగడానికి కారణంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 గతేడాది జూన్ త్రైమాసికంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 55-57 శ్రేణిలో కదిలితే ఇప్పుడది రూ. 59 - 62 శ్రేణికి తగ్గడంతో ఆ మేరకు ఎగుమతుల్లో ప్రయోజనం కలిగింది. ఈ త్రైమాసికంలో ఫారెక్స్‌లో రూ. 61 కోట్లు లాభం వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఫారెక్స్ లాభాలకు తోడు నార్త్ అమెరికా, రష్యాల్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో నికరలాభం రూ. 361 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు పెరిగినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి తెలిపారు.

 వడ్డీలతో కుదేలు
 మరోపక్క తెలుగువాళ్లు ప్రమోటర్లుగా ఉన్న ఇన్‌ఫ్రా కంపెనీలు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంతో ఈ రంగం గంపెడాశలు పెట్టుకున్నా... అవి ఇంకా వాస్తవ రూపంలోకి రాలేదు. దీంతో ఈ త్రైమాసికంలో ఇన్‌ఫ్రా కంపెనీలు కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ నష్టాలను ప్రకటించాయి. కేవలం జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికే జీఎంఆర్ రూ. 593 కోట్లు, జీవీకే రూ. 281 కోట్లు, ఐవీఆర్‌సీఎల్ రూ. 158 కోట్లు, ఎన్‌సీసీ రూ. 21 కోట్ల నష్టాలను ప్రకటించాయి.

 దేశ ఆర్థిక వ్యవస్థ రెండంకెల స్థాయి దాటి పరుగులు పెడుతుందన్న ఉద్దేశంతో ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకొని ప్రాజెక్టులు చేపట్టిన ఇన్‌ప్రా కంపెనీలకు ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనించే సరికి అంచనాలు తలకిందులై విలవిలలాడుతున్నాయి. మూడు నెలల కాలానికి జీఎంఆర్ చెల్లించిన వడ్డీనే రూ. 832 కోట్లు ఉందంటే అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఎన్‌సీసీ రూ. 180 కోట్లు, ఐవీఆర్‌సీఎల్ రూ. 160 కోట్లు, జీవీకే రూ. 130 కోట్లు వడ్డీగా చెల్లించాయి.

ఈ వడ్డీల భారం నుంచి తప్పించుకోవడానికి ఆస్తులు విక్రయించడం, లేదా వాటాల విక్రయం ద్వారా నిధులు సేకరించడంపై దృష్టిసారించాయి. జీఎంఆర్ ఇప్పటికే రూ. 1,477 కోట్లు క్విప్ ఇష్యూ ద్వారా సేకరించగా, మరో రూ. 2,500 కోట్లు సమీకరించడానికి బోర్డు అనుమతి తీసుకుంది. అలాగే ఎన్‌సీసీ, ఐవీఆర్‌సీఎల్, జీవీకే కూడా రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో నిధులు సేకరించే పనిలో ఉన్నాయి. అలాగే జీఎంఆర్, జీవీకే, ఐవీఆర్‌సీఎల్, ల్యాంకో, ఎన్‌సీసీ వంటి కంపెనీలు అనేక విద్యుత్, రోడ్డు ప్రాజెక్టులను విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ రంగానికి పూర్వవైభవం రావాలంటే వడ్డీరేట్లు తగ్గి, ఆర్థిక వృద్ధిరేటు పెరగడం ఒక్కటే మార్గమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు