‘ఎలక్ట్రానిక్స్‌’కు 50 వేల కోట్ల రాయితీలు

3 Jun, 2020 12:19 IST|Sakshi

దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం

అగ్రగామి మొబైల్స్‌ తయారీ

కంపెనీలను ఆకర్షించే లక్ష్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అగ్రగామి మొబైల్‌ తయారీ కంపెనీలను భారత్‌కు ఆకర్షించే లక్ష్యంతో.. రూ.50 వేల కోట్ల రాయితీలతో కేంద్రం ముందుకు వచ్చింది. ఈ రాయితీలను పొందేందుకు గాను ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ప్రపంచంలో అగ్రగామి ఐదు మొబైల్‌ తయారీ కంపెనీలను తొలి దశలో భారత్‌కు ఆకర్షించే లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర ఐటీ, టెలికం రంగాల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

అదే సమయంలో దేశీయంగాను ఐదు కంపెనీలను ప్రోత్సహించనున్నామని (ఐదు ఛాంపియన్లను సృష్టించడం) చెప్పారు. ‘‘మొత్తం రూ.50,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ప్రపంచ మొబైల్‌ మార్కెట్‌లో 80 శాతం వాటా 5–6 భారీ కంపెనీల చేతుల్లోనే ఉంది. పీఎల్‌ఐ పథకం కింద ఐదు అగ్రగామి కంపెనీలను అనుమతించనున్నాం’’ అని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ, స్థానిక కంపెనీలతో కలసి భారత్‌ను మంచి ఉత్పాదకత, నైపుణ్య దేశంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ తయారీ దేశంగా ఉందంటూ, మొదటి స్థానాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు ఇటీవలే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు