బ్యాంకులకు రూ.16,600 కోట్ల నష్టాలు

21 Aug, 2018 00:50 IST|Sakshi

క్యూ1లో 21 ప్రభుత్వ బ్యాంకులకు రూ.16,600 కోట్ల నష్టాలు

రూ.8.5 లక్షల కోట్లకు స్థూల ఎన్‌పీఏలు

మొండి పద్దులకు కేటాయింపులు రూ.51,500 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నష్టాలు జూన్‌ త్రైమాసికంలో ఊహించని స్థాయికి చేరాయి. 21 ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తం మీద ఏప్రిల్‌–జూన్‌ కాలంలో రూ.16,600 కోట్ల నష్టాలను ప్రకటించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.307 కోట్ల నష్టాలతో పోలిస్తే 50 రెట్లు పెరిగిపోవడం ఎన్‌పీఏల పరంగా బ్యాంకులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది.

వీటి కోసం చేసిన అధిక నిధుల కేటాయింపుల వల్లే పీఎస్‌బీల నష్టాలు అంతలా పెరిగిపోవడానికి కారణం. అయితే, కొంచెం ఊరట కలిగించే అంశం ఏమిటంటే తాజా ఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టడం. అతిపెద్ద మొండి రుణ ఖాతాలను బ్యాంకులు ఐబీసీ చట్టం కింద దివాలా చర్యలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాండ్ల ధరలు పెరగడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు ట్రేడింగ్‌ నష్టాలు అధికం అయ్యాయి.

‘‘ఎన్‌పీఏలు గరిష్ట స్థాయికి చేరువలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికి ఎన్‌పీఏలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నాం. ఆర్‌బీఐ కాల పరిమితి నిర్దేశించింది. ఎన్‌సీఎల్‌టీకి నివేదించిన ఎన్‌పీఏల ఖాతాలు 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం కావాలి. ఒకవేళ ఆలస్యం అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పరిష్కారానికి రావాల్సి ఉంటుంది’’ అని ఇక్రా ఆర్థిక సేవల రంగ రేటింగ్స్‌ విభాగం హెడ్‌ కార్తీక్‌ శ్రీనివాసన్‌ తెలిపారు.  

మూడేళ్లుగా పెరిగిన సమస్యలు
ప్రభుత్వరంగ బ్యాంకులు గత మూడు సంవత్సరాల నుంచి రుణ ఎగువేతల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఐడీబీఐ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల మొత్తం రుణాల్లో 20%కి పైగా ఎన్‌పీఏలు కావడం గమనార్హం. చాలా పీఎస్‌బీలు ప్రభుత్వ మూలధన నిధుల సాయంతోనే మనుగడ సాగిస్తున్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు. ఈ నిధుల సాయం లేకపోతే అవి ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘంచిన పరిస్థితిని ఎదుర్కొనేవి. ఈ పరిస్థితులను గమనించే 11 బ్యాంకులను ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి చేర్చింది.

పీసీఏ విధానంలో బ్యాంకులు తాజా రుణాల జారీకి అవకాశం ఉండదు. పీసీఏ పరిధిలో ఉన్న బ్యాంకులు నిర్వహణ పనితీరు పరంగా... ముఖ్యంగా ఆస్తుల నాణ్యత పరంగా మెరుగుదలను చూపించలేదని ఎస్‌ఎంసీ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌కు చెందిన బ్యాంకింగ్‌  విశ్లేషకుడు సిద్ధార్థ్‌ పురోహిత్‌ పేర్కొన్నారు. ఇక జూన్‌ త్రైమాసికంలో పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు (మొత్తం ఎన్‌పీఏలు) రూ.7.1 లక్షల కోట్ల నుంచి రూ.8.5 లక్షల కోట్లకు పెరిగాయి.

క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 18% పెరిగినట్టు. ఇక ఎన్‌పీఏ నష్టాల కోసం బ్యాంకులు జూన్‌ త్రైమాసికంలో కేటాయించిన నిధులు రూ.51,500 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న కేటాయింపుల కంటే 28% అధికం. 2017–18లో పీఎస్‌బీలు తమ చరిత్రలోనే అత్యధికంగా రూ.62,700 కోట్ల నష్టాలను చవిచూశాయి. 21 బ్యాంకులకు గాను 19 నష్టాల్లోకి వెళ్లగా, విజయా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు మాత్రమే స్వల్ప లాభాలను చూపించగలిగాయి.

గడ్డు కాలం ముగిసినట్టే: రాజీవ్‌కుమార్‌
ప్రభుత్వరంగ బ్యాంకులకు గడ్డుకాలం ముగిసినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) నుంచి పీఎస్‌బీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే బయటకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 21 పీఎస్‌బీల్లో 11 పీసీఏ పరిధిలో ఉన్న విషయం గమనార్హం.

వీటిలో దేనా బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు వ్యాపార కార్యకలాపాల విస్తరణపై ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఐబీసీ అమలు సహా  ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు మొండి బకాయిలకు కళ్లెం వేయడంతోపాటు, వాటి రికవరీ దిశగా మంచి ఫలితాలను ఇస్తున్నాయని రాజీవ్‌కుమార్‌ చెప్పారు. ఎన్‌పీఏలు తగ్గుతుండగా, రుణాల వృద్ధి పెరుగుదల మొదలైనట్టు చెప్పారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా