51% పడిపోయిన అపోలో లాభం

15 Aug, 2017 00:59 IST|Sakshi
51% పడిపోయిన అపోలో లాభం

►  జూన్‌ క్వార్టర్లో రూ.35కోట్లు
వడ్డీ వ్యయాలు, తరుగుదల ప్రభావం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపోలో హాస్పిటల్స్‌ లాభం జూన్‌ త్రైమాసికంలో ఏకంగా 51 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ లాభం రూ.35.21 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.72.17 కోట్లుగా ఉండటం గమనార్హం. ఆదాయం రూ.1,684 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.1,465 కోట్లతో పోలిస్తే 14% పెరిగింది. పన్ను అనంతరం లాభాలు తరిగిపోవడానికి ప్రధానంగా అధిక తరుగుదలకుతోడు... కొత్తగా పెరిగిన పేషెంట్ల బెడ్లపై వడ్డీ వ్యయాలే కారణమని అపోలో హాస్పిట ల్స్‌ తెలిపింది. గత మూడేళ్లలో 2,000 బెడ్లు ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది.

వీటికి సంబంధించి ప్రయోజనాలు వచ్చే రెండు మూడేళ్ల కాలంలో ప్రతిఫలిస్తాయని పేర్కొంది. హాస్పిటల్స్‌ విభాగంలో ప్రముఖ సంస్థగా అపోలో కొనసాగుతుందని, ఆంకాలజీ, న్యూరోసైన్స్, ఆర్థోపెడిక్, ట్రాన్స్‌ప్లాంట్‌ విభాగాల్లో తమ సేవలను మరింత విస్తరించేందుకు స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నట్టు కంపెనీ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. మరోవైపు ఐటీ కంపెనీ సైయంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డిని అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమించగా, ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు అయి న హబీబుల్లా బాద్షా, రాజ్‌కుమార్‌ మీనన్, రఫీఖ్‌ అహ్మద్‌ల రాజీనామాలను అమోదించినట్టు అపోలో హాస్పిటల్స్‌ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. 

మరిన్ని వార్తలు