రూపాయికి ఒకేరోజు 52 పైసలు లాభం

13 Sep, 2019 10:45 IST|Sakshi

71.14 వద్ద ముగింపు

వరుసగా ఆరవ రోజూ అప్‌ట్రెండ్‌  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో గురువారం ఏకంగా 52 పైసలు బలపడి 71.14 వద్ద ముగిసింది. ఈ ఆరు రోజుల్లో రూపాయి 125 పైసలు బలపడింది. అమెరికా–చైనా ఉద్రిక్తతలు తగ్గాయన్న అభిప్రాయాలు, వడ్డీరేట్ల తగ్గింపునకు సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌పై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్న వార్తలు డాలర్‌ను బలహీన ధోరణికి నెట్టగా, ఇదే విషయం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. దీనికితోడు కొంత దిగువకు వచ్చిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, భారత్‌ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల వంటి అంశాలూ రూపాయికి కలిసివచ్చాయి. బుధవారం రూపాయి 71.66 వద్ద ముగిసింది. గురువారం 71.46 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒకదశలో 71 స్థాయినీ తాకింది. మొత్తంమీద తాజా పరిస్థితిని చూస్తుంటే డాలర్‌ మారకంలో రూపాయి విలువ సమీప కాలంలో 70 నుంచి 72 శ్రేణిలో ట్రేడవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌ 9వ తేదీన డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు