సుప్రీంకోర్టులోనూ స్పైస్‌జెట్‌కు చుక్కెదురు

28 Jul, 2017 23:46 IST|Sakshi
సుప్రీంకోర్టులోనూ స్పైస్‌జెట్‌కు చుక్కెదురు

► ఢిల్లీ హైకోర్టు తీర్పునకు సమర్థన
► మారన్‌తో షేర్ల కేటాయింపు వివాదం
► రూ.579 కోట్లు డిపాజిట్‌ చేయాలని లోగడ హైకోర్టు తీర్పు


న్యూఢిల్లీ: చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. స్పైస్‌జెట్‌కు, ఆ సంస్థ పూర్వపు యజమాని కళానిధి మారన్‌కు మధ్య షేర్ల కేటాయింపు విషయమై నెలకొన్న వివాదంలో రూ.579 కోట్లు డిపాజిట్‌ చేయాలంటూ గత నెలలో ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్పైస్‌జెట్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

ఈ అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను స్పైస్‌జెట్‌తోపాటు దాని అధినేత అజయ్‌సింగ్‌ దాఖలు చేశారు. గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు స్పైస్‌జెట్, అజయ్‌ సింగ్‌ సవాల్‌ చేయగా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.

నిలబడని వాదనలు: ఈ వివాదంపై తొలుత ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ను ఆశ్రయించింది సన్‌టీవీ గ్రూపు చీఫ్‌ కళానిధి మారన్, ఆయనకు చెందిన కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌. కళానిధి మారన్, కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌ 2015లో స్పైస్‌జెట్‌లో ఉన్న తమ యాజమాన్య వాటా 58.46 శాతం (350,428,758 షేర్లు)ను అజయ్‌సింగ్‌కు బదలాయించారు. ఈ సందర్భంగా కుదుర్చుకున్న విక్రయ ఒప్పందం ప్రకారం... సంస్థ నిర్వహణ ఖర్చులు, రుణాల చెల్లింపుల కోసం తాము అందించిన రూ.579 కోట్ల నిధుల సాయానికి స్పైజ్‌జెట్‌ యాజమాన్యం రిడీమబుల్‌ స్టాక్‌ వారెంట్లను జారీ చేయాల్సి ఉండగా అందులో విఫలమైందని మారన్‌  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో రూ.579 కోట్లను కోర్టులో డిపాజిట్‌ చేయాలని సింగిల్‌ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. షేర్ల బదిలీ వివాదాన్ని తేల్చేందుకు ఓ ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే, మారన్‌ నిర్వహణలో ఉండగా పోగుబడిన రూ.2,000 కోట్ల నష్టాల బాధ్యత మారిన యాజమాన్యంపై పడిందని, ప్రతీ పైసా కూడా అప్పులు చెల్లించడానికి, సంస్థ నిర్వహణకే వినియోగించినట్టు స్పైస్‌జెట్‌ విచారణలో భాగంగా కోర్టుకు తెలియజేసింది.

ఫలితం లేకపోవడంతో సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్పైజ్‌జెట్, అజయ్‌సింగ్‌ డివిజెన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. డివిజన్‌ బెంచ్‌ సైతం రూ.579 కోట్లు డిపాజిట్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేమన్న స్పైస్‌జెట్‌ వాదన చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. కాకపోతే రెండు విడతలుగా రూ.579 కోట్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.

మరిన్ని వార్తలు