అరచేతిలో ఆర్థిక సేవలు..!

4 Jun, 2016 01:25 IST|Sakshi
అరచేతిలో ఆర్థిక సేవలు..!

ఉచితంగానే పొదుపు నిర్వహణ సేవలందిస్తున్న 5నాన్స్.కామ్
ఎంఎఫ్, ఎఫ్‌డీ, డిబెంచర్లు, బాండ్లు.. వంటి కొనుగోళ్లకూ అవకాశం
6 నెలల్లో 10 వేల మందికి సేవలు; హైదరాబాద్ వాటా 15 శాతం
‘సాక్షి స్టార్టప్ డైరీ’తో 5నాన్స్.కామ్ కో-ఫౌండర్ దినేష్ రోహిరా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మన దేశంలో ఆర్థిక నిర్వహణ అనేది పద్మవ్యూహాన్ని ఛేదించడం లాంటిది. ఎందుకంటే ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ డిపాజిట్స్, బంగారం, బాండ్లు, వడ్డీ పథకాలు.. ఇలా పొదుపు సాధనాల జాబితా పెద్దదే మరి. ఇందులో రిస్క్‌లేని పెట్టుబడులేంటి? ఎందులో ఎంత పొదుపు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ కావాలో సరిగ్గా విశ్లేషించడం ఒక్కోసారి ఆర్థిక నిపుణులకూ సాధ్యంకానిది.

ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉన్న ఈ ఆర్థిక నిర్వహణ లోటును పూడ్చటమే వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు ఈ మిత్రద్వయం. ముంబై కేంద్రంగా గతేడాది నవంబర్‌లో 5నాన్స్.కామ్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సంస్థ సేవలను, విస్తరణ ప్రణాళికలను 5నాన్స్.కామ్ కో-ఫౌండర్ దినేష్ రోహిరా ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆయనింకా ఏమంటారంటే..

 నేను, అజయ్ అర్జిత్‌సింగ్ ఇద్దరం హెచ్‌పీ కంపెనీలో 20 ఏళ్లకు పైగానే కలసి పనిచేశాం. ఓసారి రిలయన్స్ మనీ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సమయంలో కస్టమర్లకు, సంస్థకు మధ్య దూరాన్ని గుర్తించాం. అంటే ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ సంఘటితలేమి, కస్టమర్లతో కమ్యూనికేషన్ గ్యాప్.. వంటి అంశాలన్నమాట. టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. ఆర్థిక నిర్వహణకు సంబంధించి మాత్రం దూరం తగ్గట్లేదని తెలుసుకున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ టెక్నాలజీ ద్వారా ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి కానీ, దూరం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదనేది గ్రహించాం.

ఆర్థిక వ్యవహారాల్లో వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంది? మారుతున్న ప్రజల ఆలోచనలు.. వారి ఆర్థిక స్థితిగతులేంటి? వంటి విషయాలపై దేశవ్యాప్తంగా సర్వే చేసి ఒకే వేదికగా ఆర్థిక సేవల నిర్వహణ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. టెక్నాలజీ అభివృద్ధి, ఉద్యోగుల నియామకం, మార్కెటింగ్ వంటివాటి కోసం ఏడాది పాటు శ్రమించి రూ.2 కోట్ల పెట్టుబడితో గతేడాది నవంబర్‌లో ముంబై కేంద్రంగా 5నాన్స్.కామ్‌ను ప్రారంభించాం.

 5నాన్స్.కామ్ ప్రత్యేకతేంటంటే..
బంగారం, వడ్డీ పథకాలు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు వంటి పెట్టుబడి సాధనాలన్నింటి సమాచారమూ ఒకే వేదికగా ఉచితంగా పొందొచ్చు. రుణాలు, క్రెడిట్ కార్డుల వంటి ఉత్పత్తులనూ కొనుగోలు చేయొచ్చు. కస్టమర్ ఆర్థిక వ్యవహారాలన్నీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారమే జరుగుతాయి. ఏదైనా ఆర్థిక సేవల ఉత్పత్తుల కొనుగోళ్ల సమయంలో కేవైసీ ఆటోమేటిక్‌గా చెక్ చేస్తారు. సంబంధిత ఉత్పత్తికి సంబంధించిన మొత్తం నేరుగా అమ్మకందారు ఖాతాలోనే జమ అవుతుంది. అంటే ఉత్పత్తి సంస్థకు, కొనుగోలుదారునికి మధ్య నేరుగా ఒప్పందం జరుగుతుంది. 5నాన్స్.కామ్ ఓ ఫ్లాట్‌ఫాం మాత్రమేనన్నమాట.

 రిజిస్టరైతే చాలు..
5నాన్స్.కామ్ వెబ్‌సైట్‌లో కస్టమర్ తమ పేరును రిజిస్టర్ చేసుకోగానే ఆటోమెటిక్‌గా తమ ఖాతా రెడీ అవుతుంది. మొబైల్‌కి వచ్చే పాస్‌వర్డ్‌తో ఎవరి ఖాతాను వారే నిర్వహించుకోవచ్చు. మొదటిసారి కస్టమర్ లాగిన్ అయినప్పుడు కస్టమర్ ప్రొఫైల్, ఆదాయ, వ్యయాలు, ఆర్థికపరమైన లక్ష్యాలు, ఆదాయ అంచనాలు, ఇతర ఖర్చుల వంటి ప్రాథమిక సమాచారాన్ని ఇస్తే సరిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి పొదుపు పథకాలు చేస్తే బాగుంటుందో 5నాన్స్.కామ్ సలహాలు, సూచనలు ఉచితంగా అందిస్తుంది. అవసరమైతే అందుబాటులో ఉన్న ఉత్పత్తులను సూచిస్తుంది కూడా. అంటే మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ డిపాజిట్లు, బాండ్లు, రుణాలు, క్రెడిట్ కార్డుల వంటివన్నమాట. ఇందుకోసం 40 ఆర్థిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా కొనుగోళ్లను బట్టి 2 శాతం వరకు కమీషన్ ఉంటుంది.

హైదరాబాద్ వాటా 15%
ప్రారంభించిన 6 నెలల్లో దేశవ్యాప్తంగా మా సేవలను 10 వేల మంది వినియోగించుకున్నారు. ఇందులో హైదరాబాద్ వాటా 15% వరకూ వుంటుంది. ఈ ఏడాది చివరినాటికి మొత్తం 3 లక్షల యూజర్లకు చేరుకోవాలనేది లక్ష్యం. ఉత్పత్తుల సంఖ్యనూ పెంచనున్నాం. జీవిత/ కారు/ ఇళ్లు బీమా, పన్ను దాఖలు,  స్థిరాస్తి, పెన్షన్ పొదుపు ఉత్పత్తులన్నమాట. 3 నెలల్లో ఈ సేవలన్నీ అందుబాటులోకొచ్చేస్తాయి.

3 నెలల్లో 15 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ..
‘‘ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవలే ఏంజిల్ రౌండ్‌లో భాగంగా గ్లోబల్స్ వెంచర్స్, ఎస్పైర్ ఎమర్జింగ్ ఫండ్ సంస్థలు 3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. టెక్నాలజీ అభివృద్ధి, ఉత్పత్తుల విస్తరణ నిమిత్తం మరో 15 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ చేయనున్నాం. పలువురు సంస్థాగత పెట్టుబడిదారులతో చర్చిస్తున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తామని’’ దినేష్ వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు