గృహాల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి

9 Jan, 2019 02:00 IST|Sakshi

2018లో 2.42 లక్షల  యూనిట్ల విక్రయం

హైదరాబాద్‌సహా 8 నగరాలపై  నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక  

న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్‌ సహా పలు ప్రధాన నగరాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు సగటున 6 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు ధరలను తగ్గించడం, పరోక్షంగా డిస్కౌంట్లు ఇస్తుండటం ఇందుకు కారణం. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎనిమిది నగరాల్లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌తో పాటు ఆరు నగరాల్లో (ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌) నివాస గృహాల అమ్మకాలు పెరగ్గా... కోల్‌కతా, పుణెల్లో మాత్రం తగ్గాయి. నియంత్రణ సంస్థల విధానాల్లో మార్పులు, ధరల తగ్గుదల, పరోక్ష డిస్కౌంట్లు మొదలైన అంశాలు ఇళ్ల కొనుగోళ్ల వృద్ధికి దోహదపడ్డాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది. 2017లో 2,28,072 యూనిట్లు విక్రయాలు నమోదు కాగా గతేడాది 2,42,328 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. మిగతా ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌తో పోలిస్తే నైట్‌ ఫ్రాంక్‌ నివేదికలో విక్రయాల వృద్ధి తక్కువగా నమోదు కావడం గమనార్హం. జేఎల్‌ఎల్‌ ఇండియా గణాంకాల ప్రకారం గృహాల అమ్మకాలు ఏడు నగరాల్లో 47 శాతం పెరగ్గా, అనరాక్‌ డేటా ప్రకారం 16 శాతం, ప్రాప్‌టైగర్‌ గణాంకాల ప్రకారం తొమ్మిది నగరాల్లో 25 శాతం వృద్ధి నమోదయ్యింది.  

బెంగళూరులో అత్యధికం.. 
ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ భద్రత కారణంగా బెంగళూరులో అత్యధికంగా 27 శాతం వృద్ధి నమోదైంది. రెసిడెన్షియల్‌ విభాగంలో హైదరాబాద్‌ 15,591 యూనిట్ల అమ్మకాలతో 9 శాతం వృద్ధి నమోదు చేసింది. కోల్‌కతాలో పది శాతం, పుణెలో 1 శాతం అమ్మకాలు క్షీణించాయి. మొత్తం మీద 2018 ఆఖరు నాటికి అమ్ముడు కావాల్సిన ఇళ్ల సంఖ్య 2017తో పోలిస్తే 11 శాతం తగ్గి 4,68,372 యూనిట్లకు చేరింది. అఫోర్డబుల్‌ విభాగం ఊతంతో దాదాపు ఏడేళ్ల తర్వాత 2018లో రెసిడెన్షియల్‌ మార్కెట్‌ మళ్లీ కోలుకుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ పేర్కొన్నారు. తక్కువ జీఎస్‌టీ రేటు, అఫోర్డబుల్‌ హౌసింగ్‌కు ఇన్‌ఫ్రా హోదా కల్పించడం వంటి ప్రోత్సాహకాలు ఇందుకు తోడ్పడ్డాయని వివరించారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో సంక్షోభం కారణంగా ద్వితీయార్ధంలో నిధుల కొరత ఏర్పడిందని, దీంతో ముంబై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో అమ్మకాలు మందగించాయని ఆయన  తెలిపారు.  

ఎన్నికల దాకా ఆచితూచి: ఈ ఏడాది ప్రథమార్ధంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేదాకా మార్కెట్‌ వర్గాలు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని బైజల్‌ చెప్పారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై జీఎస్‌టీ తగ్గించవచ్చన్న అంచనాలు కొనుగోలుదార్ల సెంటిమెంటుకు ఊతమివ్వొచ్చని తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండి, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న పక్షంలో 2019 ద్వితీయార్ధంలో అమ్మకాలు గణనీయంగా పెరగొచ్చని బైజల్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు