దేశవ్యాప్తంగా 60 ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్లు

22 Dec, 2018 01:39 IST|Sakshi

ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు 60 ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్‌ సరఫరా కోసం బాట్లింగ్‌ సామర్ధ్యం మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. చిన్న స్థాయిలో ఏర్పాటయ్యే 60 ప్రైవేట్‌ బాట్లింగ్‌ ప్లాŠంట్లలో ఇండియన్‌ ఆయిల్‌ 21 ప్లాంట్లను, భారత్‌ పెట్రోలియం 20, హిందుస్తాన్‌ పెట్రోలియం 19 ప్లాంట్ల సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. సాధారణ బాట్లింగ్‌ యూనిట్‌ వార్షిక సామర్ద్యం 1,20,000 టన్నులుగా ఉంటుండగా, ప్రైవేట్‌ రంగంలోని చిన్న బాట్లింగ్‌ ప్లాంట్ల సామర్ధ్యం వార్షికంగా 30,000 టన్నులుగా ఉంటుంది. దేశీయంగా ఎల్‌పీజీ వినియోగం వచ్చే ఏడాది 6–8 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు సింగ్‌ చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఇప్పటిదాకా ఇండియన్‌ ఆయిల్‌ 2.75 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు