కారు.. బైక్‌ రయ్‌రయ్‌

12 Jun, 2018 00:27 IST|Sakshi

మే నెలలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 20 శాతం అప్‌

కార్లు, యూవీలు, వ్యాన్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి

1,61,497 యూనిట్లకు మారుతీ విక్రయాలు

మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 15 శాతం జంప్‌

స్కూటర్‌ సేల్స్‌ 1.4 శాతం డౌన్‌

సియామ్‌ తాజా గణాంకాల్లో వెల్లడి  

న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరు మీదుంది. భారత్‌లో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు మే నెలలో దాదాపు ఏకంగా 20 శాతంమేర ఎగశాయి. యుటిలిటీ వెహికల్స్, కార్లు, వ్యాన్ల విభాగాల్లోని బలమైన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండో నెలలోనూ వాహన అమ్మకాల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య ‘సియామ్‌’ తాజా గణాంకాల ప్రకారం.

ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు మే నెలలో 19.65% వృద్ధితో 2,51,764 యూనిట్ల నుంచి 3,01,238 యూనిట్లకు ఎగశాయి. దేశీ కార్ల విక్రయాలు కూడా 19.64% పెరిగాయి. ఇవి 1,66,732 యూనిట్ల నుంచి 1,99,479 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వాహన (యూవీ) అమ్మకాలు 17.53 శాతం వృద్ధితో 82,086 యూనిట్లకు, వ్యాన్ల విక్రయాలు 29.54 శాతం వృద్ధితో 19,673 యూనిట్లకు పెరిగాయి. పీవీ వాహన ఎగుమతులు కూడా 3.45% వృద్ధితో 59,648 యూనిట్లకు చేరాయి.

   ‘విక్రయాల కోణంలో చూస్తే పరిశ్రమ సరైన దారిలో వెళ్తుంది. అన్ని విభాగాల్లోనూ బలమైన విక్రయాలు నమోదయ్యాయి’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ సహా చాలా అంశాలు పీవీ విభాగంలో విక్రయాల వృద్ధికి కారణంగా నిలిచాయని పేర్కొన్నారు. జీఎస్‌టీ అమలు వల్ల ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది ‘ఏప్రిల్‌–మే’లో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని గుర్తుచేశారు.  

మారుతీ @ 1,61,497 యూనిట్లు
మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 23.99% వృద్ధితో 1,61,497 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్‌ అమ్మకాల్లో 7.14% వృద్ధి నమోదయ్యింది. 45,008 యూనిట్లకు చేరాయి. మహీంద్రా విక్రయాలు 1.63% వృద్ధితో 20,621 యూనిట్లకు, టాటా మోటార్స్‌ పీవీ విక్రయాలు 53.63% వృద్ధితో 19,202 యూనిట్లకు పెరిగాయి.

టూవీలర్‌ అమ్మకాలు 9 శాతం అప్‌
మొత్తం టూవీలర్‌ విక్రయాల్లో 9.19 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 16,94,323 యూనిట్ల నుంచి 18,50,093 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 15.16 శాతం వృద్ధితో 12,21,559 యూనిట్లకు చేరాయి. మార్కెట్‌ లీడర్‌ హీరో మోటొకార్ప్‌ దేశీ మోటార్‌సైకిల్‌ విక్రయాల్లో 17.46 శాతం వృద్ధి కనిపించింది.

ఇవి 6,37,203 యూనిట్లకు పెరిగాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అమ్మకాలు 8.91 శాతం వృద్ధితో 1,91,920 యూనిట్లకు, బజాజ్‌ ఆటో మోటార్‌సైకిల్‌ విక్రయాలు 23.01 శాతం వృద్ధితో 1,92,543 యూనిట్లకు ఎగిశాయి.

స్కూటర్‌ డీలా...
స్కూటర్‌ విక్రయాలు 1.4 శాతం క్షీణతతో 5,63,326 యూనిట్ల నుంచి 5,55,467 యూనిట్లకు తగ్గాయి. గత 15 నెలల కాలంలో స్కూటర్‌ విక్రయాలు తగ్గడం ఇదే తొలిసారి. చివరిగా 2017 జనవరిలో స్కూటర్‌ అమ్మకాల్లో 14.5 శాతం క్షీణత నమోదయ్యింది.

మార్కెట్‌ లీడర్‌ హెచ్‌ఎంఎస్‌ఐ దేశీ స్కూటర్‌ విక్రయాలు 2.09 శాతం క్షీణతతో 3,27,167 యూనిట్లకు తగ్గాయి. టీవీఎస్‌ మోటార్స్‌ అమ్మకాలు 8.87 శాతం వృద్ధితో 90,737 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్‌ స్కూటర్‌ విక్రయాలు ఏకంగా 21.49 శాతం క్షీణతతో 55,398 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు వాణిజ్య వాహన అమ్మకాలు 43.06 శాతం వృద్ధితో 76,478 యూనిట్లకు ఎగశాయి. 

మరిన్ని వార్తలు