వచ్చే ఏడాది వృద్ధి 7.5 శాతం: క్రిసిల్‌

6 Mar, 2018 00:19 IST|Sakshi

దేశీయ వినియోగమే చోదకం

బ్యాంకుల్లో ఎన్‌పీఏల పరిష్కారం కీలకం

ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2018–19) దేశ జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. దేశీయ వినియోగం, విధానాల పరంగా ప్రోత్సాహం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సానుకూల అంశాలని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017–18) మాత్రం జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని క్రిసిల్‌ పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 – 7.5 శాతం వరకు ఉండొచ్చని 2018 ఆర్థిక సర్వే సైతం పేర్కొన్న విషయం విదితమే. రెండు వరుస ప్రతికూల ఆర్థిక సంవత్సరాలు... ఒక ఏడాదిలో డీమోనిటైజేషన్, మరో ఏడాదిలో జీఎస్టీ అమలు తర్వాత వృద్ధి చెప్పుకోతగ్గ 7.5 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోనుందని క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలకు పరిష్కారం, గ్రామీణ మార్కెట్‌ తిరిగి జవసత్వాన్ని సంతరించుకోవడం, నిరంతరాయ సంస్కరణలు, ప్రపంచ వృద్ధి అన్నవి భారత వృద్ధి రేటు పెరుగుదల, స్థిరత్వాన్ని నిర్ణయించే అంశాలుగా క్రిసిల్‌ ప్రస్తావించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో 10.5 శాతానికి చేరిన స్థూల ఎన్‌పీఏల అంశాన్ని పరిష్కరించకుండా స్థిరమైన ఆర్థికవృద్ధి సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఎన్‌సీఎల్‌టీ పరిష్కార ప్రక్రియ పట్ల ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 మార్చి నాటికి ఎన్‌పీఏలు 11 శాతాన్ని చేరుకోవచ్చని అంచనా వ్యక్తం చేసింది. గ్రామీణ, మౌలిక రంగాలపై ఎక్కువగా నిధులు ఖర్చు చేయడం ద్వారా డిమాండ్, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి కలిసొస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

చైనా జీడీపీ లక్ష్యం 6.5 శాతం
బీజింగ్‌: చైనా గతేడాది మాదిరిగానే 2018 సంవత్సరంలోనూ వృద్ధి రేటు లక్ష్యాన్ని 6.5 శాతంగానే నిర్ణయించింది. సోమవారం పార్లమెంటు వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా  గడిచిన ఏడాదిలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రధాని లీ కెకియాంగ్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగానే 6.5 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని మూడు శాతం స్థాయిలోనే ఉంచాలని, కొత్తగా 1.1 కోట్ల ఉద్యోగాలను పట్టణ ప్రాంతాల్లో కల్పించాలనే లక్ష్యాలను వెల్లడించారు. నిరుద్యోగిత రేటు 5.5 శాతంగానే ఉంటుందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు