ఐకియాలో 800 కొలువులు

30 Aug, 2017 00:49 IST|Sakshi
ఐకియాలో 800 కొలువులు

హైదరాబాద్‌ స్టోర్‌ కోసం హైరింగ్‌
వచ్చే వేసవికల్లా తొలి స్టోర్‌ ప్రారంభం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్వీడన్‌కి చెందిన ఫర్నిచర్‌ విక్రయ దిగ్గజం ఐకియా భారత్‌లో.. తొలిసారి హైదరాబాద్‌లో ప్రారంభించనున్న స్టోర్‌ కోసం నియామకాల ప్రక్రియ మొదలుపెట్టింది. మొత్తం 800 మంది సిబ్బందిని (పార్ట్‌టైమ్‌ కూడా కలిపి) రిక్రూట్‌ చేసుకుంటున్నట్లు ఐకియా తెలంగాణ ఎండీ జాన్‌ అహీలియా వెల్లడించారు. డిసెంబర్‌ నాటికి సుమారు 300–400 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు పేర్కొన్నారు.

స్టోర్స్‌తో పాటు సుమారు వెయ్యికి పైగా సీట్లుండే రెస్టారెంట్‌ మొదలైన విభాగాల్లో వీరి నియామకం ఉంటుందని జాన్‌ మంగళవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. సుమారు నాలుగు లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైదరాబాద్‌ స్టోర్‌ వచ్చే వేసవి నాటికల్లా అందుబాటులోకి రాగలదని ఆయన వివరించారు. ఈ స్టోర్‌లో పదివేల పైగా ఉత్పత్తులు ఉంటాయని.. వీటిలో సుమారు 800 ఉత్పత్తులు ప్రత్యేకంగా భారతీయుల అవసరాలకు అనుగుణంగా రూపొందించినవి ఉంటాయని జాన్‌ చెప్పారు. అసెంబ్లింగ్‌ సేవలు కూడా అందించడంతో పాటు కొంతమేర ఆన్‌లైన్‌లో విక్రయాల యోచన కూడా ఉన్నట్లు తెలిపారు.  

2025 నాటికి దేశవ్యాప్తంగా 25 స్టోర్స్‌
హైదరాబాద్‌ స్టోర్‌పై సుమారు రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నామని.. ఆ తర్వాత ప్రారంభించబోయే ముంబై, బెంగళూరు స్టోర్స్‌పై కూడా పెట్టుబడి వ్యయాలు ఇదే స్థాయిలో ఉండగలవని ఐకియా ఇండియా డిప్యూటీ కంట్రీ మేనేజర్‌ ప్యాట్రిక్‌ ఆంటోనీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2025 నాటికల్లా పెద్ద, చిన్న స్థాయి అన్నీ కలిపి 25 స్టోర్స్‌ దాకా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ, చెన్నై, పుణే తదితర ప్రాంతాల్లో కూడా స్టోర్స్‌ ప్రతిపాదన ఉందన్నారు.

దాదాపు ముప్పై ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాము భారీ మ్యాట్రెస్‌లను ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నామని.. తమకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 53, తెలంగాణలో రెండు సంస్థలు సరఫరా చేస్తున్నట్లు ప్యాట్రిక్‌ చెప్పారు. 2022 నాటికి దేశీయంగా సోర్సింగ్‌ను 30 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. ఫర్నిచర్‌పై పన్నులు దాదాపు 28 శాతంగానే ఉంటోన్న నేపథ్యంలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటికీ పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని చెప్పారు.

మరిన్ని వార్తలు