నిర్మాణ సంస్థలకు రూ.800 కోట్లు

14 Jan, 2017 01:26 IST|Sakshi
నిర్మాణ సంస్థలకు రూ.800 కోట్లు

రాష్ట్రానికి రూ.40 కోట్ల నష్టం!!
హైదరాబాద్‌ రియల్టీని నట్టేట ముంచేసిన పెద్ద నోట్ల రద్దు
అమ్మకాల్లో 40 శాతం క్షీణత; ఇంకా 28,088 ఫ్లాట్లు రెడీ ఫర్‌ సేల్‌
జీఎస్టీ, రెరా, బినామీ బిల్లుల అమలుపైనే రియల్టీ ఆశలు


60 లక్షల చ.అ.లకు ఆఫీస్‌ స్పేస్‌
దేశంలో 2015లో మొత్తం 4.11 కోట్ల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరగ్గా.. 2016 నాటికిది 4.6 కోట్ల చ.అ.లకు పరిమితమైంది. ప్రత్యేకించి 2016 హెచ్‌ 2 గణాంకాలను పరిశీలిస్తే.. లావాదేవీలు 2.4 కోట్ల చ.అ., కొత్త ప్రారంభాలు 1.01 కోట్ల చ.అ.లుగా నమోదైంది. హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలను పరిశీలిస్తే.. 2015లో 46 లక్షల చ.అ. లావాదేవీలు జరగ్గా.. 2016 నాటికిది 60 లక్షల చ.అ.లకు చేరింది. అంటే 31 శాతం వృద్ధి నమోదైందన్నమాట. గూగుల్‌ 5 లక్షల చ.అ., ఫ్యాక్ట్‌సెట్‌ 4.30 లక్షల చ.అ., రెడ్‌బ్రిక్స్‌ 1.30 లక్షల చ.అ., సింక్రోని 2.20 లక్షల చ.అ. వంటి కంపెనీలు కార్యాలయాల స్థలాలను తీసుకున్న వాటిల్లో ఉన్నాయి.

సాక్షి, హైదరాబాద్‌
‘‘హైదరాబాద్‌ రియల్టీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మాత్రం లేదు. 95 శాతం మార్కెట్‌ మధ్య తరగతి గృహ విభాగం కావడమే ఇందుకు కారణం. నోట్ల రద్దు స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొస్తుంది’’

...దేశంలో రూ.1,000, రూ.500 నోట్ల రద్దు అనంతరం ఏ స్థిరాస్తి నిపుణుణ్ని, సంఘాన్ని పలకరించినా ఇదే సమాధానం. అయితే వాస్తవానికి మాత్రం వారివన్నీ ఉత్తి ముచ్చట్లేనని.. పెద్ద నోట్ల రద్దు హైదరాబాద్‌ స్థిరాస్తి రంగాన్ని నట్టేట ముంచేసిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. స్థిరాస్తి అమ్మకాల రూపంలో నిర్మాణ సంస్థలకు రావాల్సిన రూ.800 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ రూపేణ రాష్ట్రానికి దక్కాల్సిన రూ.40 కోట్ల ఆదాయానికి గండి పడిందని నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌ ఎనిమిది నగరాల్లోనూ నెలకొంది. 2016 జూలై–డిసెంబర్‌ (హెచ్‌ 2) హైదరాబాద్‌ రియల్టీ పరిస్థితిపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది..

గడిచిన నాలుగేళ్లలో హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు, ప్రారంభాల్లో ఏ ఏడాది లేని క్షీణత 2016లో కనిపించింది. 2015 క్యూ4లో 5,057 ఫ్లాట్లు అమ్ముడుపోగా.. 2016 క్యూ4 నాటికి 3,034 ఫ్లాట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంటే అమ్మకాలు 40 శాతం క్షీణించాయి. ఇంకా హైదరాబాద్‌లో విక్రయానికి సిద్ధంగా 28,088 యూనిట్లున్నాయి. ఈ గణాంకాలు చాలవూ.. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు భాగ్యనగరం స్థిరాస్తి రంగాన్ని నట్టేట ముంచేసిందనడానికి!!
కొత్తగా ప్రారంభమైన ఫ్లాట్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2015 హెచ్‌ 2లో 5,740 ఫ్లాట్లు ప్రారంభం కాగా.. 2016 హెచ్‌ 2లో ఇవి 5,900లకు పెరిగాయి. పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతం మాత్రం అధిక ప్రాధాన్యం గల మార్కెట్‌గా నిలుస్తుంది. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కార్యాలయాలకు దగ్గరగా ఉన్న గృహాల అమ్మకాల్లో 60 శాతం వృద్ధి కనిపిస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్ట్‌ల్లోనూ 73 శాతం ఈ ప్రాంతంగానే ప్రారంభమయ్యాయి.
హెచ్‌ 2లో నమోదైన మిగిలిన నగరాల గణాంకాలను పరిశీలిస్తే.. అహ్మదాబాద్‌లో కొత్త ఫ్లాట్లు 5,200, అమ్మకాలు 7,400, బెంగళూరులో కొత్తవి 13,395, అమ్మకాలు 20,309, చెన్నైలో కొత్తవి 4,800, అమ్మకాలు 7,737, కోల్‌కతాలో కొత్తవి 9,093, అమ్మకాలు 7,308, ముంబైలో కొత్తవి 9,740, అమ్మకాలు 25,403, ఎన్‌సీఆర్‌లో కొత్తవి 9,273, అమ్మకాలు 16,913, పుణెలో కొత్తవి 11,300 కొత్త ఫ్లాట్లు ప్రారంభం కాగా.. 16,800 ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి.

బడ్జెట్‌ తర్వాతే మంచి ముహూర్తం
అయితే ఏనాడూ లేని విధంగా వచ్చే నెలలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై రియల్టీ నిపుణులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పన్ను రాయితీలు, ప్రోత్సాహాకాల వంటి వాటితో నోట్ల రద్దు దెబ్బ నుంచి ఉపశమనాన్ని అందిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా 2017 మాత్రం స్థిరాస్తి రంగానికి కలిసొస్తుందని అంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌), బినామీ లావాదేవీల చట్టం వంటి వాటితో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులొస్తాయని.. పారదర్శకత నెలకొనడం ఖాయమని చెబుతున్నారు. నిబంధనలను అనుగుణంగా నిర్మాణాలు, గడువులోగా ప్రాజెక్ట్‌ల పూర్తి, అప్పగింత, నిర్మాణంలో నాణ్యత, వసతుల కల్పన.. వంటి వాటితో కొనుగోలుదారుల్లోనూ నమ్మకం పెరుగుతుందని పేర్కొంటున్నారు.    – నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, గులాం జియా

మరిన్ని వార్తలు