రికవరీకి ఏడాది పడుతుంది..

3 Apr, 2020 01:30 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రభావాలపై ప్రజల మనోగతం

క్యాన్సర్, ఎయిడ్స్‌ని మించి కరోనాపై భయం

వెలాసిటీ ఎంఆర్‌ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇది ఎప్పటికి వదులుతుందో తెలియక అందరిలోనూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ కోవిడ్‌ 19 అదుపులోకి వచ్చినా.. దీని ప్రతికూల ప్రభావాల నుంచి బైటపడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పట్టేస్తుందని దేశీయంగా ప్రజలు భావిస్తున్నారు. అంతే కాదు.. అత్యంత భయంకరమైన వ్యాధుల జాబితాలో క్యాన్సర్, ఎయిడ్స్‌ను కూడా దాటేసి కోవిడ్‌ 19 టాప్‌ ప్లేస్‌లో ఉంది. మార్కెట్‌ రీసెర్చ్, అనాలిసిస్‌ సంస్థ వెలాసిటీ ఎంఆర్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 19–20 మధ్య హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. ఇందులో 2,100 మంది పాల్గొనారు.  

చేతులు కడుక్కుంటున్నారు..
ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని 70 శాతం మందిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. సక్రమంగా పరిశుభ్రత పాటించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. 81 శాతం మంది గతంలో కన్నా మరింత తరచుగా చేతులు కడుక్కుంటున్నారు. 78 శాతం మంది జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకున్నారు. భవిష్యత్‌లోనూ విదేశాలకు ప్రయాణించేటప్పుడు ఇదే తీరు పాటించాలని భావిస్తుండటంతో .. జీవనవిధానపరమైన ఈ మార్పులు ఇకపైనా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని వెలాసిటీ ఎంఆర్‌ ఎండీ, సీఈవో జసల్‌ షా తెలిపారు.  

బైటతిరగడం మానుకోలేకపోతున్నారు..
లాక్‌డౌన్, ఆంక్షలు అమలవుతున్నప్పటికీ చాలా మంది.. ఎంత వద్దనుకున్నా తమ రోజువారీ అలవాట్లను మానుకోలేకపోతున్నారు. రద్దీ లేని వేళల్లోనే నిత్యావసరాల కొనుగోళ్లు జరపడం, ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తున్న ప్రాంతాల్లో దాన్ని ఉపయోగించడం మానుకోలేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక, ఉద్యోగ సంబంధ ప్రయాణాలు చేయడం తప్పటం లేదని 46 శాతం మంది తెలిపారు. 25 శాతం మంది తమకు వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటు లభించలేదని పేర్కొన్నారు.

సర్వేలో మరిన్ని విశేషాలు
► కోవిడ్‌–19 సంబంధ సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా టీవీ, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, దినపత్రికల (వరుస క్రమంలో)పై ఆధారపడుతున్నారు. ప్రధానంగా విశ్వసనీయ సమాచారం కోసం టీవీలు, దినపత్రికలపై ఆధారపడుతున్నారు.

► వైరస్‌ వ్యాప్తితో ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం పెరిగింది.

► దీని వ్యాప్తి నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుందని 87 శాతం మంది అభిప్రాయపడ్డారు.

► చాలా మంది ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవడంతో ట్రావెల్, టూరిజం రంగాలు అత్యధికంగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఉంది. ఇతర త్రా వ్యాపారాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావమే పడిందని 92 శాతం మంది భావిస్తున్నారు.  

► తెలిసినవారు ఎదురుపడినప్పుడు షేక్‌హ్యాండ్‌లు, కౌగిలించుకోవడాల్లాంటివి కొంత కాలం పాటు ఆగుతాయని 71 శాతం మంది తెలిపారు. అలాగే, విదేశాలకు వెళ్లేవారు కూడా మరింత జాగ్రత్తగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

► వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో ప్రపంచం కోవిడ్‌ 19 ప్రభావాల నుంచి బైటపడగలదని 84% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు