ఎగుమతులు 8వ నెలా డీలా!

15 Aug, 2015 00:39 IST|Sakshi
ఎగుమతులు 8వ నెలా డీలా!

♦ 10 శాతం క్షీణత నమోదు 
♦ దిగుమతులూ తగ్గాయ్
♦ వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లు
 
 న్యూఢిల్లీ : ఎగుమతులు వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ క్షీణించాయి. 2014 జూలై విలువతో పోల్చితే 2015 జూలైలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధిలేకపోగా- 10.3 శాతం క్షీణించింది. విలువ 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల పతనం వల్ల... ఆ ఎగుమతుల విలువ పెద్దగా లేకపోవడం వంటి కారణాలు దిగుమతుల తిరోగమనానికి కారణం. మొత్తం దేశ ఎగుమతుల్లో పెట్రోలియం ప్రొడక్టుల వాటా దాదాపు 18 శాతం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.

 దిగుమతులూ అంతే...
 దేశానికి దిగుమతులు కూడా 10 శాతం తగ్గాయి. విలువ 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురు దిగుమతులు బిల్లు తగ్గడం దీనికి ప్రధాన కారణం. దీనితో ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా చమురు దిగుమతుల విలువ 34.91 శాతం తగ్గి, 9.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ విభాగం వాటా 31 శాతం. చమురు యేతర దిగుమతుల విలువ 3.8 శాతం పెరిగి 26.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.

 విభాగాల వారీగా: పెట్రోలియం ప్రొడక్టులు (-43 శాతం), తోలు, తోలు ఉత్పత్తులు (-10 శాతం), సముద్ర ఉత్పత్తులు (-18 శాతం), రసాయనాల (-6 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణించాయి.

 పసిడి దిగుమతులు 62 శాతం అప్
 పసిడి దిగుమతులు జూలైలో 62 శాతం ఎగశాయి. జూలైలో ఈ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.

మరిన్ని వార్తలు