తిరుపతి లడ్డు.. 90 రోజులు సేఫ్!

5 Nov, 2014 01:38 IST|Sakshi
తిరుపతి లడ్డు.. 90 రోజులు సేఫ్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుపతి లడ్డు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రసాదమంటే ఎవరికైనా ప్రీతి. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులకు ఇక లడ్డు త్వరగా పాడవుతుందన్న చింత అక్కర లేదు. లడ్డు 90 రోజుల పాటు మన్నేలా వాక్యూమ్ ప్యాకింగ్‌లో నూతన విధానాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) అభివృద్ధి చేసింది.

ఒక్కో లడ్డూకు ప్యాక్‌నుబట్టి రూ.1-2 ఖర్చు అవుతుంది. ఈ టెక్నాలజీని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా తెలిపారు. ఒక్కో మెషీన్‌కు రూ.50 లక్షల వ్యయం అవుతుందన్నారు. ఇతర స్వీట్లకు కూడా నూతన ప్యాకింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 6-7 తేదీల్లో జరిగే జాతీయ ప్యాకేజింగ్ సదస్సు విశేషాలను వెల్లడించేందుకు మంగళవారం ఏర్పాటైన మీడియా సమావేశం అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.

 జీవిత కాలం పెంచేందుకు..
 ఆహారోత్పత్తులు ఎక్కువ కాలం మన్నేలా నూతన ప్యాకింగ్ విధానాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నామని సాహా వెల్లడించారు.

 ‘ఖర్జూర చెట్టు నుంచి తీసిన బెల్లం వంటి రసం జీవిత కాలం 5 గంటలు మాత్రమే. 75 రోజులు మన్నేలా మల్టీ లేయర్ కో ఎక్స్‌టెండెడ్ ప్లాస్టిక్ బాటిల్‌ను రూపొందించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అందించాం. రిఫ్రిజిరేటర్‌లో గొర్రె మాంసం 3 రోజులు నిల్వ చేయొచ్చు. దీనిని 9 రోజులకు పెంచేలా మాడిఫైడ్ అట్మాస్‌ఫియర్ ప్యాకేజింగ్ (ఎంఏపీ) ద్వారా పరిశోధన చేస్తున్నాం. అలాగే చికెన్ లెగ్స్ 20 రోజులు మన్నేలా కొత్త విధానాన్ని కనుగొనే పనిలో ఉన్నాం. కొన్ని రకాల స్వీట్స్ కోసం ప్లాస్టిక్ కంటైనర్లను తయారు చేస్తున్నాం’ అని చెప్పారు. ఎగుమతి అవుతున్న గుడ్లలో 1% పగిలిపోతున్నాయి. గుడ్లు ఒకదానికొకటి తగలకుండా నూతన రకం ప్యాక్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు